దారుణ హత్య: గొంతుకోసి..కత్తులతో పొడిచి..

14 Sep, 2021 07:37 IST|Sakshi
కిరణ్‌ (ఫైల్‌ఫోటో)

ఆభరణాల తయారీదారుడు దారుణహత్య

వ్యాపార ప్రత్యర్థుల పనేనా..?

కదిరి(అనంతపురం జిల్లా): పట్టణంలోని చౌక్‌ వీధిలో నివాసముంటున్న బంగారు ఆభరణాల తయారీదారుడు కిరణ్‌(23) సోమవారం దారుణహత్యకు గురయ్యాడు. మేడపైన గదిలో నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి, కత్తులతో  పొడిచి చంపారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మహారాష్ట్రలోని సతార్‌ జిల్లాకు చెందిన లకాన్, నేతాజీ, కృష్ణా, రాము, సంజయ్‌ ఇంకా సుమారు 20 కుటుంబాలకు చెందిన వారు (సేట్‌లు)  20 ఏళ్ల క్రితం కదిరికి వచ్చారు. బంగారు నగలు కరిగించడం, కొత్త ఆభరణాల తయారీ వ్యాపారంలో స్థిరపడ్డారు. సతార్‌ జిల్లా కతార్‌ తాలూకా కలదాన్‌ గ్రామానికి చెందిన కిరణ్‌ను కదిరిలో స్థిరపడిన లకాన్‌ అనే వ్యాపారి తీసుకొచ్చి తన దుకాణంలో పని చేయించుకునేవాడు. అతనికింకా పెళ్లి కాలేదు. ఆభరణాల తయారీలో మంచి నైపుణ్యం సంపాదించాడు. రెండేళ్లుగా చౌక్‌లో ఓ మేడపైన గదిని అద్దెకు తీసుకొని సొంత వ్యాపారం మొదలుపెట్టాడు. (చదవండి: అత్తగారింట్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య)

ఎదుగుదలను జీర్ణించుకోలేకే చంపేశారా?
పట్టణంలోని బంగారు వ్యాపారులతో కిరణ్‌ సఖ్యతగా ఉంటూ చెప్పిన సమయానికి నగలు సిద్ధం చేసి ఇచ్చేవాడు. దీంతో ఎక్కువ మంది అతనికే పని ఇచ్చేవారు. ఇది తోటి సేట్‌లకు నచ్చేది కాదు. కొందరైతే కిరణ్‌ దెబ్బకు ఇక్కడ వ్యాపారాలు తగ్గిపోయాయని తిరిగి మహారాష్ట్రకు చేరుకున్నారు.

ఇక్కడున్న వారు ఎలాగైనా అతన్ని కదిరి నుంచి పంపించేయాలని భావించారు. ముదిగుబ్బకు వెళ్లి బంగారు దుకాణం ఏర్పాటు చేసుకోవాలని, దానికయ్యే ఖర్చు మొత్తం తామే భరిస్తామని కూడా సూచించారు. ఇందుకు అతను అంగీకరించలేదు. తమ వ్యాపారాన్ని దెబ్బతీశాడన్న కోపంతో అతన్ని కిరాయి హంతకులతో చంపించారా అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. హత్య అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున మూడు గంటల మధ్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

సీసీ కెమెరాలకు చిక్కకుండా.. 
చౌక్‌ వీధిలోని సీసీ కెమెరాలకు చిక్కకుండా హంతకులు జాగ్రత్త పడ్డారు. ఘటనా స్థలానికి పోలీసు జాగిలాలను తీసుకొచ్చి ఆధారాల కోసం పరిశీలింపజేశారు. అవి చుట్టుపక్కల మిద్దెలపై సంచరించాయి. దీంతో ఆ దారి గుండా వచ్చి హత్యచేసి మళ్లీ అటే వెళ్లిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. కిరణ్‌ తన గదిలోని లాకర్‌లో పెద్ద మొత్తంలో దాచుకున్న నగదును హంతకులు ముట్టుకోలేదని సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం  ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయాన్ని హతుని కుటుంబీకులకు తెలియజేశారు.  సంతాప సూచికంగా పట్టణంలో సోమవారం బంగారు దుకాణాలు మూసేశారు.

చదవండి:
పెళ్లై, ఇద్దరు పిల్లలు.. ప్రియుడితో పరార్‌.. చివరికి..   

మరిన్ని వార్తలు