ప్రేమోన్మాది దారుణం..కత్తితో పొడిచి.. టవల్‌తో గొంతు నులిమి

2 Jul, 2021 03:49 IST|Sakshi

గూడూరు: ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గురువారం దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది తన ప్రేమికురాలి ఇంట్లోకి చొరబడి ఆమెను అతి కిరాతకంగా హతమార్చాడు. చుట్టుపక్కల వాళ్లు రావడంతో తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న వెంటనే వచ్చిన పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. గూడూరులోని తిరుపతి రైల్వేలైన్‌ గేటు సమీపంలో పల్లెపాటి సుధాకర్, సరిత దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరూ ఉపాధ్యాయులు. వీరికి ఇంజనీరింగ్‌ చదువుతున్న తేజస్విని, పదో తరగతి చదువుతున్న కుమారుడు సంతానం. గురువారం దంపతులిద్దరూ పాఠశాలకు వెళ్లగా ఇంట్లో తేజస్విని, ఆమె సోదరుడు ఉన్నారు. చెన్నూరు పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చిన్నికృష్ణ కుమారుడు వెంకటేష్‌ బెంగళూరులో స్టాఫ్‌వేర్‌ ఇంజనీర్‌. ప్రస్తుతం ఇంటి వద్దే ఉండి పని చేస్తున్నాడు. తేజస్విని, వెంకటేష్‌ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఈ విషయం పెద్దలకు తెలియడంతో వారిద్దరూ కలవకుండా కట్టడి చేశారు. 

కత్తితో పొడిచి.. టవల్‌తో గొంతు నులిమి..
గురువారం యువతి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగానే వెంకటేష్‌ ఆమె ఇంటికి వచ్చాడు. తేజస్విని సోదరుడు తలుపు తీయగానే అతడిని నెట్టేసి లోపలికి చొరబడి ఆమె ఉన్న గదిలోకి వెళ్లి గడియ పెట్టేశాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో గానీ వెంకటేష్‌.. తేజస్విని గొంతులో కత్తితో పొడిచి, ఆపై టవల్‌తో గొంతు నులిమి చంపేశాడు. యువతి సోదరుడి కేకలతో అక్కడికి చేరుకున్న ఇరుగుపొరుగువారు కిటికీలోంచి చూడగా బెడ్‌పై తేజస్విని పడి ఉంది. స్థానికులు రావడంతో భయపడ్డ వెంకటేష్‌ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఈలోపు అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఇద్దరినీ హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే యువతి మృతి చెందిందని.. వెంకటేష్‌కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు