హైదరాబాద్‌లో దారుణం.. భార్య తలనరికి పోలీస్‌ స్టేషన్‌కు..

10 Dec, 2021 17:18 IST|Sakshi

కట్టుకున్న వాళ్లే ఆ మహిళల పాలిట కాలయముళ్లయ్యారు. కాపాడాల్సిన వారే కర్కశత్వంతో ప్రాణాలు తీశారు. అనుమానం పెనుభూతమై ఓ రాక్షసుడు కట్టుకున్న భార్యను దారుణంగా తలనరికి హత్య చేశాడు. ఆ తర్వాత ఆ తలను తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. మరో ఘటనలో గొంతు నులిమి భార్యను హత్య చేసిన దుర్మార్గుడు శవాన్ని ఇంట్లోనే ఉంచేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. మానవత్వానికే మచ్చ తెచ్చేలా నిలుస్తున్న ఈ ఘటనలు నగరంలోని అత్తాపూర్, కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో శుక్రవారం వెలుగు చూశాయి. 

సాక్షి, రంగారెడ్డి:  అనుమానం పెనుభూతమైంది. పెళ్లై 14 సంవత్సరాలైనా భార్యపై నమ్మకం కుదరలేదు. నిత్యం వేధిస్తూ చిత్రహింసలకు గురి చేశాడు. కేసు పెడితే..శిక్ష అనుభవించి వచ్చి పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నాడు. చివరకు ఆమెను దారుణంగా కడతేర్చాడు. తల నరికి ప్లాస్టిక్‌ సంచిలో వేసుకొని ముగ్గురు పిల్లలతో సహా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. గగుర్పాటు కలిగిస్తున్న ఈ ఘటన అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పాతబస్తీకి చెందిన షమ్రీన్‌ అలియాస్‌ సమ్రీన్‌కు, ఎంఎం పహాడీ హిమ్మత్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ పర్వేజ్‌తో 14 ఏళ్ల కిందట పెళ్లయింది. వీరికి ముగ్గురు పిల్లలు. పెట్రోల్‌బంక్‌లో పని చేసే మహ్మద్‌ పర్వేజ్‌ పెళ్లినాటి నుంచే భార్యను అనుమానిస్తూ ఉండేవాడు. నాలుగేళ్ల కిందట వేధింపులు అధికం కావడంతో సమ్రీన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని జైలుకు పంపించారు.

జైలు నుంచి వచ్చిన పర్వేజ్‌ పెద్దల సమక్షంలో రాజీ కోసం భార్య కుటుంబ సభ్యుల వద్దకు వచ్చాడు. ముగ్గురు పిల్లలు ఉండడంతో ఆమె తిరిగి కలిసి ఉండేందుకు ఒప్పుకుంది. కొన్ని రోజుల పాటు సాఫీగానే సాగింది. మళ్లీ ఆరు నెలలుగా పర్వేజ్‌ ప్రతి విషయంలో సమ్రీన్‌ను అనుమానిస్తూ పలురకాలుగా వేధిస్తున్నాడు. మద్యానికి బానిసై...భార్యను కొడుతూ శారీరకంగా హింసిస్తున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు 15 రోజుల కిందటే సర్ది చెప్పారు.  

మాంసం కోసే కత్తితో... 
గురువారం రాత్రి మద్యం సేవించి వచ్చిన పర్వేజ్‌ భార్యను చితకబాదాడు. అనంతరం భోజనం చేసి నిద్రపోయాడు. అర్థరాత్రి లేచి ఇంట్లో మాంసం కోసే కత్తితో భార్యపై దాడి చేశాడు. మొండెం నుంచి తలను వేరు చేసి ప్లాస్టిక్‌ కవర్‌లో వేసుకున్నాడు. ముగ్గురు పిల్లలను తీసుకుని రక్తపు దుస్తులతోనే అర్థరాత్రి వేళ రెండు కిలోమీటర్లు నడిచి అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. భార్య తలను తీసి టేబుల్‌పై పెట్టి..తానే హత్య చేశానని చెప్పాడు. ఒక్కసారిగా రక్తమోడుతున్న తలను చూసిన నైట్‌ డ్యూటీ కానిస్టేబుల్‌ భయాందోళనకు గురయ్యాడు. ఇన్‌స్పెక్టర్‌తో పాటు రాజేంద్రనగర్‌ ఏసీపీకి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.  

గది మొత్తం రక్తపు మరకలే... 
పర్వేజ్‌ భార్యపై కత్తితో దాడి చేసిన సమయంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. కత్తితో దాడి చేయడంతో గది మొత్తం రక్తం చిల్లింది. అతి కిరాతకంగా మొండెం, తలను వేరు చేశాడు. పక్కనే నిద్రిస్తున్న పిల్లలు ఈ సంఘటనతో భయకంపితులై ఏమి మాట్లాడలేని స్థితిలో తండ్రితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. తాత, అమ్మమ్మ వచ్చిన అనంతరం జరిగిన విషయాన్ని వారికి తెలిపినట్లు సమాచారం.  

కఠినంగా శిక్షించాలి... 
తమ సోదరిని కిరాతకంగా హత్య చేసిన మహ్మద్‌ పర్వేజ్‌ను కఠినంగా శిక్షించాలని సమ్రీన్‌ సోదరుడు కోరారు. జైలుకు వెళ్లి వచ్చాక మంచిగా ఉంటానని చెప్పాడని, ఇంత దారుణానికి పాల్పడతాడని అనుకోలేదని ఆయన కన్నీరుమున్నీరయ్యాడు.  
చదవండి: (భార్యపై అనుమానం.. గూడ్స్‌ షెడ్‌లో దారుణహత్య)

మరిన్ని వార్తలు