రోజూ డబ్బులు వస్తాయని నమ్మించి దంపతులకు టోపి

20 Nov, 2021 14:13 IST|Sakshi

సాక్షి, హిమాయత్‌నగర్‌(హైదరాబాద్‌): ఇన్వెస్ట్‌ చేస్తే రోజూ డబ్బులు వస్తాయని నమ్మించి తమని ఓ వ్యక్తి మోసం చేశాడంటూ యూసఫ్‌గూడకు చెందిన భార్యాభర్తలు శుక్రవారం సిటీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులైన దంపతులిద్దరికీ ఇన్వెస్ట్‌మెంట్‌ అంటే ఇష్టం. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఆర్టీ గోల్డ్‌ యాప్‌లో డబ్బు పెట్టించాడు. ముందుగా రూ. 500కి రూ. 1000 ఇచ్చి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

ఆ తర్వాత పలు దఫాలుగా ఇప్పటి వరకు రూ. 2.80 లక్షలు ఇన్వెస్ట్‌ చేయగా.. వాటిలోంచి ఒక్క రూపాయి కూడా రాలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రశీన్‌రెడ్డి తెలిపారు.   

మరో ఘటనలో..

ఆభరణాల తయారీకి ఇచ్చిన 43 తులాల బంగారంతో పరార్‌ 
హిమాయత్‌నగర్‌: ఆభరణాల తయారు చేసేందుకు ఇచ్చిన 43 తులాల బంగారంతో పనివాళ్లు పరారయ్యారు. నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌హెచ్‌ఓ భూపతి గట్టుమల్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదర్‌గూడలోని యాష్‌ జ్యువెలరీ షాప్‌ యజమాని అభిషేక్‌ అగర్వాల్‌ కొంత కాలంగా వీరికి నమ్మకంగా ఉన్న అభిజిత్‌ మైతితో ఆభరణాలను తయారు చేయిస్తున్నారు. ఇటీవల ఒకేసారి 43 తులాల బంగారాన్ని ఆభరణాల తయారు చేసేందుకు ఇచ్చారు.

సదరు ఆభరణాలు ఈ నెల 18న ఇవ్వాల్సి ఉంది. అవి రాకపోవడంతో యజమాని అభిషేక్‌ అగర్వాల్‌ అభిజిత్‌ మైతికి ఫోన్‌ చేయగా.. తనవద్ద పని చేస్తున్న రాహుల్‌ అమిన్‌తో పంపిస్తున్నానని తెలిపారు. గంటలు గడిచినా రాలేదు. సరికదా ఇద్దరి ఫోన్స్‌ స్విచ్చాఫ్‌ వస్తున్నాయి. దీంతో తాను మోసయోయానని తెలుసుకున్న బాధితుడు అభిషేక్‌ అగర్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ గట్టుమల్లు వివరించారు.

చదవండి: వివాహేతర సంబంధం: నమ్మించి లాడ్జికి తీసుకువెళ్లి..

మరిన్ని వార్తలు