డిజిటల్‌ కాయిన్‌ పేరుతో భారీ మోసం

19 Sep, 2022 09:01 IST|Sakshi

సాక్షి, చెన్నై: డిజిటల్‌ కాయిన్‌ సంస్థ నడిపి కోట్ల రూపాయలు మోసానికి పాల్పడిన కేసుకు సంబంధించిన ఆరుగురు నిందితుల సొంతమైన ఇల్లు, కార్యాలయాలలో ఆర్థిక నేర విభాగం పోలీసులు సోదాలు నిర్వహించారు. వివరాలు.. కృష్ణగిరి జిల్లా కావేరిపట సమీపంలోని వరట్టపట్టికి చెందిన ప్రకాశ్‌ (46) నేతృత్వంలో 60 మందికిపైగా గత 9వ తేది కలెక్టర్‌ కార్యాలయానికి తరలివచ్చి కలెక్టర్‌ జయచంద్ర బాను రెడ్డి వద్ద ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌ మాట్లాడుతూ.. యునివర్‌ కాయిన్‌ పేరిట డిజిటల్‌ కాయిన్‌ సంస్థను నిర్వహిస్తూ వచ్చిన హోసూర్‌ రామకృష్ణా నగర్‌కు చెందిన అరుణ్‌ కుమార్, కృష్ణగిరికి చెందిన నందకుమార్, మత్తూర్‌కు చెందిన శంకర్, ప్రకాశ్‌ బర్గూర్‌ సమీపంలోని చెట్టిపట్టికి చెందిన శ్రీనివాసన్, ధర్మపురి జిల్లా మారండహల్లికి చెందిన వేలన్‌ తదితరులు తనను కలిసి మాట్లాడినట్లు తెలిపారు.

డిజిటల్‌ కాయిన్‌ కొనుగోలు చేస్తే, తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించవచ్చని తెలిపి లక్షలాది రూపాయలు కట్టించుకుని తమను మోసం చేసినట్లు చెప్పారన్నారు. ఈ విషయంపై విచారణ జరిపి తగిన చర్యలు చేపట్టాల్సిందిగా కృష్ణగిరి జిల్లా ఆర్థిక నేర విభాగం పోలీసులకు కలెక్టర్‌ ఆదేశించారు. ఈస్థితిలో ఆదివారం ఉదయం కృష్ణగిరి జిల్లా ఆర్థిక నేర విభాగం డీఎస్పీ శివకుమార్, సేలం జిల్లా ఆర్థిక నేర విభాగం డీఎస్పీ శ్రీనివాసన్, ఇన్‌స్పెక్టర్‌ ముత్తమిళ సెల్వన్, కృష్ణగిరి ఇన్‌స్పెక్టర్‌ వివేకానందమ్‌ అధ్యక్షతన కృష్ణగిరి, సేలం ధర్మపురి, నామక్కల్, ఈరోడ్‌ జిల్లాల నేర విభాగం పోలీసు ఇన్‌స్పెక్టర్లు 50 మందికి పైగా డిజిటల్‌ కాయిన్‌ పేరిట మోసాలకు పాల్పడిన వారి ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. వివిధ రికార్డులు, ఫైళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

చదవండి: హాస్టల్‌ విద్యార్థినుల వీడియోల లీక్‌ దుమారం: స్నానం చేస్తూ నాలుగు వీడియోలు పంపిందంతే!

మరిన్ని వార్తలు