గురువుగా నమ్మించి.. ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ రావడంతో

21 Feb, 2022 08:25 IST|Sakshi
డీఎస్పీ కార్యాలయానికి వచ్చిన బాధితులు. ఇన్‌సెట్లో నిందితుడు గండికోట ఆంజనేయులు

పలమనేరు(చిత్తూరు జిల్లా): ఓంశక్తి గురువుగా ప్రజలతో పరిచయం పెంచుకుని ఆపై చీటీలు వేస్తూ.. అధిక వడ్డీ ఆశ చూపి వందలాది మంది నుంచి రూ.25 కోట్లు వసూలు చేసిన వ్యక్తి కనిపించకుండా పోయిన ఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో చోటుచేసుకుంది. బాధితులు ఆదివారం పలమనేరు డీఎస్పీ గంగయ్యను కలసి ఈ మేరకు గోడు వెళ్లబోసుకున్నారు. వారి కథనం ప్రకారం.. బాపట్లకు చెందిన గండికోట ఆంజనేయులు 20 ఏళ్ల క్రితం బంగారుపాళేనికి వచ్చి నెహ్రూ వీధిలో ఓంశక్తి భక్తునిగా సేవలు చేసేవాడు. శక్తి పేరిట ఓ ఆలయాన్ని సైతం దాతల సాయంతో నిర్మించి అక్కడ నిత్యాన్నదానం చేయడం ప్రారంభించాడు.

చదవండి: అమ్మాయిల సంఖ్య ‘అనంత’లోనే తక్కువ.. ఎందుకిలా?  

ఇలా భక్తులను పెంచుకుని వారితో మాల వేయిస్తూ ఏటా మేల్‌మరుత్తూర్‌ ఆదిపరాశక్తి గుడికి వందల సంఖ్యలో బస్సుల్లో తీసుకెళ్లేవాడు. ఇలా ప్రజల్లో నమ్మకం పెంచుకొని ఓంశక్తి పేరుతో చీటీల వ్యాపారం మొదలుపెట్టాడు. దీంతో పాటు అధికవడ్డీ ఇస్తానంటూ పలువురి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నాడు. వారికి చెల్లని చెక్కులను అంటగట్టాడు. నాలుగు రోజుల క్రితం అతని ఇంటికి తాళం వేసి ఉండటంతో పలువురు ఆయనకు ఫోన్‌చేశారు.

ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ రావడంతో ఆయన సొంతూరైన బాపట్ల వెళ్లి ఆరా తీసినా ఆచూకీ దొరకలేదు. అతను ఇచ్చిన చెక్కుల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పేరు రాసి మోసం చేసినట్టు గుర్తించారు. దీంతో డబ్బులు పోగొట్టుకున్నామని భావించిన బాధితులు ఆదివారం డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. బంగారుపాళేనికి చెందిన లీలమ్మ నుంచి రూ.97 లక్షలు, డి.కిశోర్‌ నుంచి రూ.50 లక్షలు, రమేష్‌ నుంచి రూ.34 లక్షలు ఇలా సుమారు 200 మంది నుంచి రూ.25 కోట్లకు పైగా డబ్బులు తీసుకున్నట్టు బాధితులు డీఎస్పీకి తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బంగారుపాళెం ఎస్‌ఐని డీఎస్పీ ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు