ఆరోగ్యం బాగు చేస్తామని క్షుద్ర పూజలు, ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌

18 Apr, 2021 13:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఇంట్లో మీ అమ్మకి ఆరోగ్యం బాగాలేదు.. క్షుద్ర పూజలు చేస్తే ఆరోగ్యం నయమవుతుందని మాయమాటలు చెప్పి నగదు, బంగారుతో పరారయ్యారు. దీనిపై మహబూబ్‌నగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో జీఓ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసు బిజినపల్లి పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. వన్‌టౌన్‌ ఎస్‌ఐ నాగరాజు కథనం ప్రకారం.. బిజినపల్లి మండలం మంగనూర్‌కి చెందిన పుష్ప తల్లి మాణిక్యమ్మకు రెండు నెలల నుంచి ఆరోగ్యం బాగా ఉండటం లేదు. ఈ క్రమంలో 15రోజుల కిందట ఇద్దరు గుర్తు తెలియని మహిళలు అదే గ్రామంలో కొందరికి జాతకం చెప్పారు. అలాగే సదరు మహిళలు పుష్ప ఇంటికి వచ్చి మీ ఇంట్లో ధనం ఉంది. దీంతోనే మీ అమ్మకి ఆరోగ్యం క్షీణిస్తోందని, నయం చేసేందుకు మీ ఇంట్లో క్షుద్రపూజలు చేసి ధనం తీస్తే ఆరోగ్యం బాగవుతుందని చెప్పారు.

దీనికి ఆ కుటుంబసభ్యులు ఒప్పుకోవడంతో మూడు రోజుల పాటు ఇంట్లో క్షుద్రపూజలు నిర్వహించి ధనం తీసేందుకు పూజ సామాన్లు అవసరమన్నారు. దీనికోసం రూ.లక్ష నగదు, మూడు తులాల బంగారం తీసుకున్నారు. పూజ సామాన్లు మహబూబ్‌నగర్‌లో లభిస్తాయని ఈనెల 14న వచ్చి పరిశీలించారు. ఇక్కడ లభించడం లేదని హైదరాబాద్‌లో ఉంటాయని అక్కడికి వెళ్లి తీసుకువస్తామని చెప్పి సదరు మహిళలు వెళ్లిపోయారు. రెండు రోజుల నుంచి వారికి ఫోన్‌ చేస్తే స్విచ్ఛాప్‌ రావడంతో బాధితురాలు మోసపోయినట్లు గ్రహించి వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
చదవండి: వివాహేతర సంబంధం: అడ్డుగా ఉందని కన్నతల్లి దారుణం!

మరిన్ని వార్తలు