నూటొక్క జిల్లాల.. కేటుగాడు! 

7 Sep, 2021 04:25 IST|Sakshi
విగ్గుతో, విగ్గు లేకుండా నిందితుడు శ్రీనివాస్‌

బట్టతలను దాచి మ్యాట్రిమోనీ సైట్లలో యువతులకు ఎర 

తొలుత పరిచయం.. ఆపై చాటింగ్‌.. చివరకు చీటింగ్‌ 

పలువురు యువతులను మోసగించి రూ.లక్షల్లో నగదు లూటీ 

గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ నిందితుడు 

రూ.50 వేల నగదు, ఓ విగ్గు, రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం 

అతను ఉన్నత చదువులు చదివాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కూడా పనిచేశాడు. అయితే తన ప్రతిభను, అర్హతలను సక్రమంగా కాకుండా వక్రమార్గంలో వాడాడు. కొన్నేళ్ల క్రితం మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ ద్వారా ఓ యువతితో పరిచయం పెంచుకుని, చాటింగ్‌తోనే చీటింగ్‌ చేసి రూ.లక్షలు కొట్టేశాడు. చాలా సులువుగా డబ్బులు రావడంతో అప్పటినుంచి అదే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. తనకు బట్టతల ఉన్న విషయాన్ని దాచి.. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో యువతులకు వల వేసి మోసాలకు పాల్పడ్డాడు. అంతేకాదు.. గంజాయి స్మగ్లింగ్, నకిలీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు పెట్టి ఉద్యోగాల పేరిట మోసాలు.. ఇలా అతని నేరాల చిట్టా చేంతాడంత ఉంది. చివరకు పోలీసుల చేతికి చిక్కడంతో అతగాడి లీలలకు తెరపడింది. 

చిత్తూరు అర్బన్‌: పెళ్లికాని యువతులను మ్యాట్రిమోనీ (వివాహ సంబంధాల) వెబ్‌సైట్ల ద్వారా పరిచయం చేసుకుని, వారి నుంచి రూ.లక్షలు కాజేసే కేటుగాడిని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్పీ సెంథిల్‌కుమార్, డీఎస్పీ సుధాకర్‌రెడ్డిలు సోమవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన పున్నాటి శ్రీనివాస్‌ (33) డిగ్రీ వరకు అద్దంకిలో చదివి, హైదరాబాద్‌లో ఎంసీఏ చేశాడు. ఆపై ఐఐటీ కాన్పూర్‌లో ఎంటెక్‌ చేస్తూ మధ్యలో మానేశాడు. కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేశాడు. 2017లో ఓ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో తన ఫొటో ఉంచగా.. ఓ యువతి పరిచయమైంది. ఆ యువతితో ఆన్‌లైన్‌ చాటింగ్‌ చేసి రూ.లక్షలు కాజేశాడు. కష్టపడకుండానే డబ్బులు రావడంతో ఇదే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. పలు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో తనకు బట్టతల ఉన్న విషయాన్ని దాచిపెట్టి.. విగ్గుతో ఉన్న ఫొటోలు పెట్టేవాడు.

నకిలీ పేర్లతో పెళ్లికాని యువతులతో ఆన్‌లైన్‌లో చాటింగ్‌ చేయడం, పరిచయం పెరిగాక మాయమాటలు చెప్పి వారితో డబ్బులు తన బ్యాంకు ఖాతాలోకి వేయించుకునేవాడు. అలా.. 2017లో ఒంగోలుకు చెందిన ఓ టెకీ యువతి వద్ద రూ.27 లక్షలు, 2018లో నరసరావుపేటకు చెందిన మరో టెకీ యువతి వద్ద రూ.40 లక్షలు కాజేసి రెండు సార్లు అరెస్టు కూడా అయ్యాడు. జైలు జీవితం అనుభవించినా శ్రీనివాస్‌లో ఏమాత్రం మార్పు రాలేదు. రెండు నెలల క్రితం చిత్తూరుకు చెందిన ఓ యువతిని మ్యాట్రిమోనీ ద్వారా మోసం చేసి రూ.1.4 లక్షలు, మదనపల్లెలో మరో యువతిని మోసం చేసి రూ.7 లక్షలు కాజేశాడు. బాధిత యువతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడికోసం గాలిస్తుండగా.. చిత్తూరు–బెంగళూరు బైపాస్‌ రోడ్డు వద్ద నాలుగు కిలోల గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ దొరికిపోయాడు. విచారణలో శ్రీనివాస్‌ లీలలు వెలుగుచూశాయి. నకిలీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేయడం లాంటి నేరాల చిట్టా బయటపడింది. నిందితుడి నుంచి రూ.50 వేల నగదు, ఓ విగ్గు, రెండు సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించడంలో ప్రతిభ చూపించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డులు అందజేశారు. 

మరిన్ని వార్తలు