తండ్రికి బ్లాక్‌ఫంగస్‌.. కుమారుడికి టోకరా! 

29 May, 2021 06:41 IST|Sakshi
సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ధనుంజయ్‌ 

హిమాయత్‌నగర్‌: బ్లాక్‌ ఫంగస్‌తో బాధపడుతున్న తన తండ్రి మెడిసిన్‌ కోసం ఓ కుమారుడు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. సమీప బంధువు ఇచ్చిన సమచారం మేరకు ఓ వ్యక్తిని ఫోన్‌ ద్వారా సంప్రదించగా.. ఆ వ్యక్తి కుమారుడి వద్ద నుంచి రూ. లక్షకుపైగా దోచుకుని ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేయడంతో.. మినిష్టర్‌ లైన్‌ టీవీకాలనీకి చెందిన ధనుంజయ్‌ అనే బాధితుడు సైబర్‌క్రైం పోలీసులను శుక్రవారం ఆశ్రయించారు.

బాధితుడు ధనుంజయ్‌ సమాచారం మేరకు... తన తండ్రి సమీర్‌కుమార్‌ అవస్తీకి బ్లాక్‌ఫంగస్‌ సోకింది. మినిష్టర్‌ రోడ్డులోని కిమ్స్‌ ఆసుపత్రిలో అడ్మిట్‌ చేశాడు. ‘పొసకొనజోల్‌’ అనే మెడిసిన్‌ కావాలని వైద్యులు సూచించడంతో.. సమీప బంధువును ఆశ్రయించాడు. ఆయన తనకు తెలిసిన మెడికల్‌ రెప్రజెంటేటివ్‌ నాగరాజు అనే యువకుడిని ఫోన్‌ ద్వారా సంప్రదించాడు.

ఈ మెడిసిన్‌ ఖర్చు రూ. 1.50 లక్షలు అవుతుందని చెప్పడంతో.. గూగూల్‌పే, ఐఎంపీఎస్‌ ద్వారా నాగరాజు అనే వ్యక్తికి ధనుంజయ్‌ గురువారం సాయంత్రం, శుక్రవారం ఉదయం రూ. 1.29 లక్షలు పంపించాడు. ఆ డబ్బులు అందినప్పటి నుంచి నాగరాజు ఫోన్‌ స్విచ్చాఫ్‌ వస్తుంది. దీంతో బాధితుడు సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించి నాగరాజుపై ఫిర్యాదు చేశారు. 
చదవండి: వ్యభిచార నిర్వాహకులపై పీడీ యాక్ట్‌


 

మరిన్ని వార్తలు