రుణం ఇప్పిస్తానని టోకరా 

29 Jan, 2021 08:06 IST|Sakshi

పోస్టాఫీస్‌ ఉద్యోగినంటూ ఓ వ్యక్తి మోసం

కణేకల్లులో మోసపోయిన దంపతులు

మరో వ్యకినీ మోసం చేసేందుకు యత్నం    

ఎస్‌పీఎంను కలిసి మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు

కణేకల్లు: రూ.10 వేలు ఇస్తే ప్రధానమంత్రి ప్రీలోన్‌ మంజూరవుతుందని నమ్మించి డబ్బుతో ఓ వ్యక్తి ఉడాయించిన ఘటన కణేకల్లు మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు..కణేకల్లులోని బస్టాండ్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న సావిత్రమ్మ, మధుసూదన్‌ దంపతులు బజ్జీలు, వడలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. అపరిచిత వ్యక్తి వారింటికి వెళ్లి తాను పోస్టాఫీస్‌ ఉద్యోగినని పరిచయం చేసుకున్నాడు. వారితో మాటలు కలిపాడు. తనకు పింఛన్‌ వస్తోందని మధుసూదన్‌ చెప్పగా..అయితే రూ.5 వేలు చెల్లిస్తే రూ.30 వేలు రుణం, రూ.10 వేలు చెల్లిస్తే రూ.60 వేల రుణం వస్తుందని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన దంపతులు రూ.10 వేలు నగదు ఇచ్చారు. అనంతరం వారి నుంచి ఆధార్‌కార్డును మొబైల్‌లో ఫొటో తీసుకున్నాడు. పోస్టాఫీస్‌కు వచ్చి కలవండి అని చెప్పి వెళ్లిపోయాడు. డబ్బు కోసం దంపతులు పోస్టాఫీసుకు వచ్చి, ఆరాతీశారు. తమ సిబ్బంది ఎవరూ డబ్బు తీసుకోరని ఎస్‌పీఎం శ్రీనివాసాచారి చెప్పారు. దీంతో మోసపోయామని బాధితులు తెలుసుకున్నారు. 

దుర్గమ్మ గుడి వద్ద టోకరాకు యత్నం 
ఉదయం 10.30 గంటలకు అదే వ్యక్తి కణేకల్లు శివారులో దుర్గమ్మ గుడి వద్ద నివాసముంటున్న వెంకటేశ్వర్‌రావు ఇంటికెళ్లి పోస్టాఫీసు ఉద్యోగినని పరిచయం చేసుకుని, వివరాలు ఆరా తీశాడు. తన కొడుకు బుద్ధిమాంద్యుడు.. పింఛన్‌ కూడా వస్తోందని ఆయన చెప్పాడు. అయితే రూ.5వేలు ఇస్తే పోస్టాఫీస్‌కు వెళ్లి మీ పేరున అక్కౌంట్‌ ఓపెన్‌ చేస్తామని, రూ.30వేలు రుణం వస్తుందని నమ్మించాడు. తన వద్ద డబ్బులేదు, తన భార్య ఆస్పత్రికి వెళ్లింది..సాయంత్రం మీ ఆఫీస్‌కు వచ్చి అకౌంట్‌ ఓపెన్‌  చేస్తామని చెప్పే ప్రయత్నం చేశాడు. అయినా వినకుండా కనీసం రూ.3వేలు అయినా ఇవ్వండి..తన వద్ద రూ.2వేలు ఉంది.. ఈ మొత్తంతో అకౌంట్‌ ఓపెన్‌ చేస్తానని బలవంతం చేయగా, ఇంటి యజమాని డబ్బు ఇవ్వకుండా పంపించేశాడు. మధ్యాహ్నం వెంకటేశ్వర్‌రావు భార్య తన కుమారుడిని పిలుచుకుని పోస్టాఫీస్‌ వద్దకు వెళ్లి, వివరాలు ఆరాతీసింది. ఉదయం రాజు అనే ఉద్యోగి మా ఇంటికి వచ్చి, రూ.5వేలు ఇస్తే రుణం మంజూరు చేస్తామని చెప్పాడని, మాకు ఫ్రీలోన్‌ ఇవ్వాలని ఆమె అడిగింది. సబ్‌పోస్టుమాస్టర్‌ కె. శ్రీనివాసాచారి కలగజేసుకుని లోన్లు ఇస్తామని చెప్పి, ఎవరూ ఇళ్ల వద్దకు రారని, అలా ఎవరైనా ఇళ్ల వద్దకు వస్తే ఎవరూ నమ్మవద్దని చెప్పి పంపారు. 

అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మకండి  
ప్రభుత్వ పథకాలు ఫ్రీగా మంజూరు చేస్తామని బెనిఫిటరీ వాటా లేదా అకౌంట్‌ కోసం డబ్బులివ్వాలని కొత్త వ్యక్తులు ఎవరైనా ఇళ్లవద్దకు వచ్చి అడిగితే నమ్మొద్దు. కణేకల్లులో ఓ అపరిచిత వ్యక్తి అమాయకులను మోసం చేశాడు. మరో కుటుంబాన్ని మోసం చేసే ప్రయత్నం చేశాడు. ఇలా కొత్త వ్యక్తులు ఎవరొచ్చి మాయ మాటలు చెప్పినా నమ్మవద్దు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తుంటే తమకు సెల్‌: 9440901870కు సమాచారం ఇవ్వండి.  
– కె.సురేష్,ఎస్‌ఐ  

మరిన్ని వార్తలు