ఘరానా మోసం: టీవీలో యాంకర్‌ చాన్స్‌లు, కంపెనీలలో ఉద్యోగాలంటూ..

30 Apr, 2021 09:07 IST|Sakshi

సాక్షి, త్రిపురారం(నల్లగొండ): టీవీలో యాంకర్‌ చాన్స్‌లు, జ్యోతిష్యం, ఉద్యోగాలు, కంపెనీల్లో వాటాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని త్రిపురారం పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇటీవల రూ.6లక్షల50వేలు తీసుకొని మోసం చేశాడని మండలంలోని లోక్యాతండాకు చెందిన మెగావత్‌ హనుమంత్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయవాడకు చెందిన కోనాల అచ్చిరెడ్డిపై ఫిర్యాదు చేశాడు. ఈమేరకు నిందుతుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరిపారు.

కోనాల అచ్చిరెడ్డి టీవీలో యాంకర్‌ చాన్స్‌లు, జ్యోతిష్యం, ఉద్యోగాలు, కంపెనీల్లో వాటాలు ఇప్పిస్తానంటూ మోసం చేయడమే వృత్తిగా పెట్టుకున్నాడన్నారు. ఖమ్మంలో ఓ యువతికి టీవీలో యాంకరింగ్, మరో మహిళకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యో గం, మరో మహిళకు రైల్వే అసిస్టెంట్‌ ఉద్యోగం అంటూ మోసం చేశాడని తెలిపారు. ఇటీవల నల్లగొండ పట్టణంలో హనుమాన్‌ నగర్‌కు చెందిన ఓ యువకుడు, విజయవాడకు చెందిన ఓ యువతికి ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ టీ వీ చానల్‌ యాంకర్‌ అవకాశం, నల్లగొండలో జ్యోతిష్యం పేరిట మరో వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డాడన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయా స్టేషన్‌ల్లో సైతం కేసులు నమోదయ్యాయని ఎస్‌ఐ చెప్పారు. ఎస్పీ రంగనాథ్‌ ఆదేశాల మేరకు నిందితుడిపై పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేసి వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించినట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు