ప్రియురాలికి మరోకరితో పెళ్లి....జీర్ణించుకోలేక కత్తితో దాడి..ఆ తర్వాత

14 Dec, 2022 08:33 IST|Sakshi

సాక్షి, మియాపూర్‌ (హైదరాబాద్‌): ప్రియురాలితో పాటు ఆమె తల్లిపై ఓ యువకుడు కత్తితో దాడి చేయడమేగాక తానూ గొంతుకోసుకుని  ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ తిరుపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... గుంటూరుజిల్లా, ఇసుకపల్లికి చెందిన వెంకటరాజు, శోభ  దంపతులకు కుమార్తె వైభవీ, కుమారుడు గోవర్ధన్‌ ఉన్నారు.  వెంకటరాజు ముంబైలో ప్యాబ్రికేషన్‌ పనులు చేస్తూ అక్కడే ఉంటున్నాడు. శోభ తన కుమార్తె వైభవీ, గోవర్ధన్‌తో కలిసి మియాపూర్‌లోని న్యూ – హఫీస్‌పేట ఆదిత్య నగర్‌లో ఉంటోంది.

కాగా అదే గ్రామానికి చెందిన సందీప్‌ అలియాస్‌ బబ్లూ వారి ఇంటి పక్కనే ఉండేవాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం  ప్రేమకు దారితీసింది. ఈ విషయం తెలియడంతో వైభవి కుటుంబసభ్యులు ఆమెను మందలించారు. దీంతో కొన్నాళ్లుగా వైభవీ సందీప్‌ను దూరం పెడుతుంది. దీనిని జీర్ణించుకోలేని సందీప్‌ ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమెకు తరచూ ఫోన్‌ చేసి  తనతో మాట్లాడాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని, చంపేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో శోభ ఇద్దరు పిల్లలతో సహా నగరానికి వలస వచ్చి న్యూ – హాపీస్‌పేట ఆదిత్యనగర్‌లో ఉంటున్నారు.

కొద్ది రోజుల క్రితం వైభవికి తమ సమీప బంధువుతో పెళ్లి కుదిరింది. వచ్చే ఆదివారం వారి నిశ్చతార్థం జరిపేందుకు నిశ్చయించారు. ఈ విషయం తెలియడంతో మంగళవారం ఉదయం నగరానికి వచ్చిన సందీప్‌ నేరుగా  వైభవి ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. కోపంతో కూరగాయాలు కోసే కత్తితో వైభవీ, ఆమె తల్లి శోభపై దాడి చేశాడు. వైభవిని గొంతు కింద చాతీభాగంలో, తల్లి శోభను కడుపులో  పొడిచాడు. ఆ తర్వాత అదే చాకుతో దీపూ గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వీరి అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని రక్తం మడుగులో ఉన్న ముగ్గురిని ఆసుపత్రికి కొండాపూర్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సందీప్‌ను కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రి తరలించారు. వైభవీ, తల్లి శోభలను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

నిలకడగా సందీప్‌ ఆరోగ్యం  
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సందీప్‌ను పోలీసులు కోఠి ఈఎన్‌టీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోగి పరిస్థితి పరిశీలించిన ఈఎన్‌టీ వైద్యులు అతడి గొంతుకు ఆపరేషన్‌ చేశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఈఎన్‌టీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.  

మరిన్ని వార్తలు