ప్రేమ వివాహం.. వేధింపులు.. ఇక భర్తతో కలిసి ఉండలేనని..

21 Jan, 2022 12:01 IST|Sakshi
ఆత్మహత్యాయత్నం చేసిన ప్రదీప్‌ జయచంద్రతో మాట్లాడుతున్న న్యాయవాదులు

సాక్షి, గుంటూరు(తెనాలి): కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కోర్టు ప్రాంగణంలోకి పెట్రోలు సీసా, ప్లకార్డులతో వచ్చి, పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, గమనించిన న్యాయవాదులు, పోలీసులు అతని వద్ద నుంచి పెట్రోలు సీసా, లైటర్‌ లాక్కుని స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉంటే తనపై భర్త పెట్రోలు పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడని, తాను తప్పించుకున్నానని అతని భార్య తెలిపింది. పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  తెనాలి 12వ వార్డుకు చెందిన ఆటో డ్రైవర్‌ చెరుకూరి ప్రదీప్‌జయచంద్ర సుమారు పదేళ్ల క్రితం తెనాలికే చెందిన హరితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొద్ది రోజులకే భార్యను వేధించడం ప్రారంభించాడు. 2019 వరకు ఓపిక పట్టిన ఆమె ఇక భర్తతో కలిసి ఉండలేనని పుట్టింటికి వెళ్లిపోయి, వారి సహకారంతో వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టగా ప్రస్తుతం కోర్డులో నడుస్తోంది. చినరావూరులో వార్డు వలంటీర్‌గా పని చేస్తున్న ఈమె ఇంటికి తరచూ ప్రదీప్‌జయచంద్ర వెళ్లి దాడి చేయడం, ధూషించడం చేస్తుండేవాడు.

చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా ప్రియున్ని మరిచిపోలేదు.. భర్తకు తెలిసి..)

ఈ క్రమంలో బుధవారం రాత్రి11.30 గంటల ప్రాంతంలో ఆమె ఇంటికి వెళ్లి ధూషించడంతో పాటు విద్యుత్‌ ఫ్యూజు తొలగించాడు. దీంతో బాధితురాలు గుంటూరులోని దిశ పోలీస్‌స్టేషన్‌కు సమాచారమివ్వగా, వారు తెనాలి వన్‌టౌన్‌ పోలీసులను బాధితురాలి ఇంటికి పంపారు. అదే సమయంలో టవల్‌తో ఆమె మెడకు ఉరి వేసేందుకు  ప్రదీప్‌జయచంద్ర యత్నిస్తున్నాడు. పోలీసులు అతన్ని స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. తిరిగి గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో హరిత ఇంటికి వెళ్లి జయచంద్ర ఆమెపై పెట్రోలు పోసి, నిప్పంటించేందుకు యత్నించగా కేకలు వేయడంతో చుట్టపక్కల వాళ్లు రావడంతో పరారయ్యాడు.

ఇది జరిగిన కొద్ది గంటలకు పెట్రోలు సీసా, తనకు న్యాయం కావాలంటూ ప్లకార్డులతో అతను కోర్టు ప్రాంగణానికి చేరుకున్నాడు. తన తప్పు లేకుండా వన్‌టౌన్‌ ఎస్‌ఐ చాణక్య తనపై దాడి చేశాడని ఆరోపిస్తూ ఒంటిపై పెట్రోలు పోసుకుని లైటర్‌తో నిప్పంటించుకునేందుకు యత్నించాడు. అక్కడే ఉన్న న్యాయవాది హరిదాసు గౌరీశంకర్, పోలీసు కానిస్టేబుళ్లు పెట్రోలు సీసా, లైటరును లాక్కుని నీళ్లు పోశారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ పోలీసులు  జయచంద్రను స్టేషన్‌కు తరలించారు. భర్తపై హరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై ఐపీసీ 307 సెక్షను కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జయచంద్రపై దాడి చేశారన్న ఆరోపణల గురించి ఎస్‌ఐ చాణక్యను వివరణ కోరగా, బుధవారం రాత్రి దిశ పోలీస్‌స్టేషన్‌ నుంచి వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బంది హరిత ఇంటికి వెళ్లారని, లేకుంటే అదే సమయంలో జయచంద్ర ఆమెను హతమార్చి ఉండేవాడని తెలిపారు. వెంటనే స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపామని చెప్పారు. 

మరిన్ని వార్తలు