ఏడాది నుంచి లవ్‌: ప్రియురాలు దక్కడం లేదని..

11 Aug, 2021 14:09 IST|Sakshi
ప్రధాన రహదారిపై మృతదేహంతో రాస్తారోకో చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులు, పవన్‌కుమార్‌ (ఫైల్‌)  

యువకుడి బలవన్మరణం

సాక్షి, మహబూబ్‌నగర్‌ : ప్రేమించిన యువతి తనకు దక్కడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌లోని లింగమయ్యకాలనీకి చెందిన కాట్రాజు పవన్‌కుమార్‌ (23), ఓ యువతి ఏడాది కాలంగా ప్రేమించుకున్నారు. ఇటీవల యువతి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు సోమవారం రాత్రి ఇంటి వద్ద పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు.

ఇది గమనించిన బంధువులు వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో అదే అర్ధరాత్రి మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కాగా, పవన్‌కుమార్‌ తల్లిదండ్రులు సుమారు 12ఏళ్ల క్రితమే మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడగా, ప్రస్తుతం సోదరి మాత్రమే ఉంది. ఈ విషయమై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

మృతదేహంతో రాస్తారోకో  
యువకుడి మృతికి ప్రేమించిన యువతి తల్లిదండ్రులే కారణమంటూ అంబేద్కర్‌కూడలిలో పవన్‌కుమార్‌ మృతదేహంతో బంధువులు అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. బాధ్యులను శిక్షించి, బాధిత కుటుంబ సభ్యులకు తగు న్యాయం చేయాలన్నారు. సీఐ బీషన్న చేరుకుని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.  

మరిన్ని వార్తలు