లోన్‌ యాప్‌ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య

25 Dec, 2020 02:07 IST|Sakshi
సంతోష్‌కుమార్‌ (ఫైల్‌) 

ఆత్మహత్య చేసుకున్న ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఉద్యోగి  

సాక్షి, ఫెర్టిలైజర్‌ సిటీ (రామగుండం): ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ల కారణంగా ఇటీవల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. తాజాగా లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సంతోష్‌కుమార్‌ ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కర్మాగారంలో సైట్‌ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నాడు. ఎన్టీపీసీ మల్కాపూర్‌ గ్రామంలో అద్దెకు ఉంటున్న సంతోష్‌ ఇంట్లోనే చిన్న కిరాణా దుకాణం కూడా నడుపుతున్నాడు. దీని నిర్వహణకు ఐదు ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా రూ.60 వేల వరకు అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పుకు వడ్డీ, అసలు మొత్తం చెల్లించాలని యాప్‌ల నిర్వాహకులు రోజూ బెదిరిస్తుండటంతో భయాందోళనకు గురైన సంతోష్‌ ఈ నెల 18న ఇంట్లో గడ్డిమందు తాగాడు. చదవండి: (ప్రాణాంతక యాప్‌లు!)

ఆన్‌లైన్‌ వడ్డీ వ్యాపారులు వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని మొబైల్‌ ద్వారా స్నేహితులకు వీడియో పంపించాడు. గమనించిన ఇరుగుపొరుగు వారు గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అనంతరం పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌కు తరలించారు. ఈ విషయం బాధితుడి కుటుం బసభ్యులకు మిత్రులు సమాచారమందించగా ఈనెల 21న సంతోష్‌ను తూర్పుగోదావరి జిల్లాకు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం వైజాగ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందా డు. తన మిత్రుడు ఆన్‌లైన్‌ వేధింపుల వల్లే మృతిచెందాడని, దీనికి కారణమైన లోన్‌ యాప్‌ యజమానులపై చర్యలు తీసుకోవాలని గురువారం సంతోష్‌కుమార్‌ మిత్రుడు బ్రహ్మచారి ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్వరూప్‌రాజ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు