భార్య కోసం వెతుకుతూ భర్త గల్లంతయ్యాడు..

15 Dec, 2020 11:16 IST|Sakshi
వెంకటరవికుమార్, పుష్పశివ దంపతులు (ఫైల్‌ ఫోటో)

భార్య తన పక్కన లేకపోయేసరికి ఆ భర్త కంగారు పడ్డాడు. ఆమె కోసం తీవ్రంగా గాలించాడు. గోదావరి చెంత ఆమె చెప్పులు కనిపించేసరికి నదిలోకి దూకేసిందనుకున్నాడు. తాను కూడా వెంటనే ఆమె కోసం ఆవేశంగా ఆ నదిలోకి దూకేశాడు. అయితే అంతా అనుకున్నట్టే భార్య ఆమె పుట్టింటి వద్ద ప్రత్యక్షమైంది. భర్త మాత్రం గోదావరిలో గల్లంతయ్యాడు. 

సాక్షి, మామిడికుదురు: భార్య గోదావరి నదిలో దూకేసిందన్న బాధతో భర్త కూడా అదే గోదావరి నదిలో దూకి గల్లంతైన సంఘటన పెదపట్నం గ్రామంలో సోమవారం జరిగింది. చివరకు భార్య పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బంధువుల ఇంట క్షేమంగా ఉందన్న సమాచారంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గ్రామంలో తాపీ పనిచేసుకుంటూ జీవించే యర్రంశెట్టి వెంకటరవికుమార్‌(28) అనే యువకుడు పాశర్లపూడి బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి గల్లంతయ్యాడు. చదవండి: ('రమ్యశ్రీని కొట్టి చంపేశారు..')

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. భార్యాభర్తలిద్దరూ ఆదివారం రాత్రి 11 గంటల వరకు టీవీ చూశారు. రాత్రి వారి మధ్య ఏం జరిగిందో ఏమో తెల్లవారుజామున రెండు గంటలకు భర్త నిద్ర లేచి చూసే సరికి భార్య పుష్పశివ కనిపించలేదు. భార్య ఆచూకీ కోసం ఊరంతా గాలించాడు. మెడలో ఉండాల్సిన మంగళసూత్రాలు ఇంట్లో ఉండడం, గోదావరి నది ఒడ్డున భార్య వేసుకునే చెప్పు లు కనిపించడంతో భార్య నదిలో దూకేసిందని భావించాడు. వెంటనే చెప్పులు తీసుకుని ఇంటికి వచ్చి చెప్పులు తల్లికి చూపించి అవి తన భార్యవని నిర్ధారించుకుని, వెంటనే బైక్‌ తీసుకుని సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాశర్లపూడి బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. అక్కడ బైక్‌ ఉంచి అమాంతంగా గోదావరి నదిలో దూకేశాడు. స్థానిక మత్య్సకారులు దీనిని గమనించారు. చదవండి: (జీవితం మీద విరక్తితోనే చనిపోతున్నా..)


పాశర్లపూడిలో వైనతేయ నది వద్ద గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్న రాజోలు ఎస్సై కృష్ణమాచారి

వెంకటరవికుమార్, పుష్పశివకు మూడేళ్ల కిత్రం వివాహమైంది. వారికి 11 నెలల బాబు ఉన్నాడు. జనవరి 20న తిరుపతి వెళ్లి బాబు పుట్టి వెంట్రుకలు మొక్కు తీర్చాలని టికెట్లు కూడా బుక్‌ చేయించుకున్నారు. ఇంతలోనే ఈ విషాదం జరగడంతో అతడి∙కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పుష్పశివ గతంలో కూడా ఇలానే అదృశ్యమైందని స్థానికులు పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా బంధువుల ఇంటికి వెళ్లి ఉంటుందని భావించారు. అంతా అనుకున్నట్టే భార్య ప్రత్యక్ష కావడం, భర్త గల్లంతు కావడం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై రాజోలు ఎస్సై డి.కృష్ణమాచారి ఆధ్వర్యంలో నగరం ఏఎస్సై టి.ప్రసాదరావు కేసు దర్యాప్తు చేపట్టారు. గల్లంతైన యువకుడి కోసం వైనతేయ నదిలో గాలింపు చేపట్టారు. 

>
మరిన్ని వార్తలు