నిమ్స్‌లో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

12 Jan, 2021 08:27 IST|Sakshi

సాక్షి, పంజగుట్ట: అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి నిమ్స్‌ ఆవరణలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. నిమ్స్‌ ఆసుపత్రి మిలీనియం బ్లాక్‌ వెనకభాగంలో పార్కింగ్‌ వద్ద ఉన్న చెట్టుకు సోమవారం ఉదయం ఓ వ్యక్తి లుంగీతో ఉరివేసుకొని వేలాడుతుండటం స్థానికులు గుర్తించారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పంజగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. ఆధారాలకోసం చూస్తే ఎలాంటి గుర్తింపు కార్డులు కనిపించలేదు. అతని వయస్సు సుమారు (45) ఉండవచ్చునని పోలీసులు తెలిపారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చదవండి: పెళ్లి కావడం లేదని.. 

మాట్లాడితే మర్డరే ! 
సాక్షి, సిటీబ్యూరో: సిటీతో పాటు శివార్లలో వరుసగా దారుణాలు వెలుగు చూస్తున్నాయి. పూటకోచోట విచ్చుకత్తుల వేట చోటు చేసుకుంటుండటంతో అంతా ఉలిక్కిపడుతున్నారు. గడిచిన ఎనిమిది రోజుల్లో ఎనిమిది హత్యలు జరగడంతోపాటు కొన్ని వెలుగులోకి వచ్చాయి. మూడు రోజుల పాటు ఒకే రోజు రెండేసి చొప్పున బయటపడ్డాయి. తాజాగా ఆదివారం రాజేంద్రనగర్‌లో రెండు దారుణ హత్యలు బయటపడ్డాయి. కొన్ని కేసుల్లో నిందితులు చిక్కగా... మరికొన్నింటిలో గుర్తించాల్సి ఉంది. చదవండి: విద్యార్థినిపై మాజీ ఎమ్మెల్యే లైంగిక దాడి!

తిన్న వాటికి డబ్బు అడిగినందుకు.. 
షాకబ్‌ అలీ కేపీహెచ్‌బీ ప్రాంతంలో తోపుడు బండిపై పండ్లు విక్రయిస్తుంటాడు. ఈ నెల 4న  ఇద్దరు వ్యక్తులు ద్రాక్షలు తిని, పైనాపిల్‌ కొన్నారు. కొన్న దానికే డబ్బు ఇచ్చి వెళ్ళిపోతుండగా... తిన్న వాటికీ డబ్బు అడిగాడు. దీంతో ఇద్దరూ కలిసి అతడిపై దాడి చేయడంతో చనిపోయాడు. అదే రోజు కూకట్‌పల్లిలోని చెరువులో పూల వ్యాపారి కృష్ణ మృతదేహం లభించింది. ఎక్కడో చంపేసిన దుండగులు గోనె సంచిలో కట్టి తీసుకువచ్చి చెరువులో పడేశారు.  

మద్యం మానమన్నందుకు... 
కేపీహెచ్‌బీ పోలీసుస్టేషన్‌ పరిధిలో స్రవంతితో వెంకటేశ్వర్లు ఏడాదిగా సహజీవనం చేస్తున్నాడు. ఈమెను ఐదున హత్య చేసిన వెంకటేశ్వర్లు డబ్బాలో పార్సిల్‌ చేసి మృతదేహం మాయం చేయాలని భావించాడు. అది సాధ్యం కాకపోవడంతో తన సొంత ఇంటిలోనే మృతదేహాన్ని వదిలి పారిపోయాడు. మద్యం తాగవద్దని పదేపదే చెప్పడంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ నెల 5న ఈ దారుణం జరిగింది. 

తాగేందుకు డబ్బు ఇవ్వలేదని... 
ఎస్సార్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో నివసించే సంతోష్‌ మద్యానికి బానిస అయ్యాడు. తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కారణంగా ఈ నెల 9న తన తల్లి సంగీతను దారుణంగా చంపేశాడు.  

ఒకే రోజు మరో రెండు...
ఆదివారం నగర శివార్లలో రెండు హత్యలు వెలుగు చూశాయి. డబ్బు కోసం బెదిరిస్తుండటం, ఒకరి సోదరికి వేధిస్తుండటంతో ఇద్దరు పాత నేరగాళ్ళు తమ స్నేహితుడు రియాజ్‌ను హత్య చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘాతుకంలో మృతదేహాన్ని సూట్‌కేసులో తెచ్చి రాజేంద్రనగర్‌ డెయిరీ ఫామ్‌ వద్ద పడేశారు. ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. రాత్రి 11.45 గంటలకు మరో ఘోరం చోటు చేసుకుంది. అప్పుగా తీసుకున్న రూ.11 లక్షలు, వడ్డీ కోసం ఒత్తిడి చేస్తూ, హోటల్‌ తన పేరుతో రాసి ఇవ్వమని డిమాండ్‌ చేస్తుండటంతో ఎంఐఎం నేత ఖలీల్‌ను హతమార్చారు. ఇతడి వద్ద అప్పుతీసుకున్న హోటల్‌ యజమాని, అతడి వద్ద పని చేసే ఇద్దరితో కలిసి హత్య చేశారు. 

జూబ్లీహిల్స్, మియాపూర్‌ పోలీసుస్టేషన్ల పరిధి నుంచి అదృశ్యమైన ఇద్దరు ఈ నెల 7న శవాలుగా తేలారు. జూబ్లీహిల్స్‌లో పని చేసే వెంకటమ్మ గత నెల 30న బయటకు వెళ్ళింది. ఈమె మృతదేహం ఘట్‌కేసర్‌లో కాలిన స్థితిలో కనిపించింది. జనప్రియ కాలనీ నుంచి ఏటీఎంకి అంటూ వెళ్ళిన రామకృష్ణ మృతదేహం ఖైత్లాపూర్‌ డంపింగ్‌ యార్డ్‌లో దొరికింది. దుండగులు ఒక చెవి, 
కుడి చేతి రెండు వేళ్ళు కోసేశారు.  

చట్టం కఠినంగా మారాలి.. అందరిలో మార్పు రావాలి 
వర్తమాన పరిస్థితులతో పాటు సినిమా ప్రభావంతో ఇటీవల కాలంలో యువతలో యాంటీ సోషల్‌ పర్సనాలిటీ పెరుగుతోంది. ఈ కారణంగానే చిన్న కారణాలకు చంపేసే వరకు వెళ్తున్నారు. మరోపక్క మద్యానికి బానిసైన వాళ్ళు ఆ మత్తు కోసమూ ఘాతుకాలు చేస్తున్నారు. మత్తు, ఆస్తి కోసమూ అనుమానంతోనో తమ వాళ్ళనే అంతం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా జరిగే ఘర్షణల్లో ఎదుటి వారు చనిపోతుండటంతో అవి సాంకేతిక హత్యలుగా మారుతున్నాయి. చట్టం మరింత కఠినంగా మారడంతో పాటు ప్రతి ఒక్కరిలోనూ మార్పు వస్తేనే ఈ పరిస్థితులు మారేది. 
– డాక్టర్‌ రాజశేఖర్, మానసిక నిపుణులు

మరిన్ని వార్తలు