Hyderabad Crime Today: నా చావుకి వారే కారణం.. విడిచిపెట్టకండి

9 Jul, 2022 07:53 IST|Sakshi

సాక్షి,రాజేంద్రనగర్‌(హైదరాబాద్‌): బ్యాంకు క్రెడిట్‌ కార్డు, యాప్‌ లోన్స్‌ రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ క్రాంతికుమార్‌ తెలిపిన మేరకు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన దత్తాత్రేయ(32) కుటుంబం అత్తాపూర్‌ పాండురంగానగర్‌ ప్రాంతంలో నివసిస్తుంది. దత్తాత్రేయ నగరంలోని ఓ నగల దుకాణంలో సేల్స్‌మన్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు సంతానం.  ఇటీవల దత్తాత్రేయ సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటు పడ్డాడు.

రెండు యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు పాల్పడ్డాడు. ఇలా బానిసై జూన్‌ వరకు రూ. ఏడు లక్షల వరకు అప్పులు చేశాడు.  ఆ తరువాత మూడు క్రెడిట్‌ కార్డులు, రెండు లోన్‌ యాప్స్‌ ద్వారా డబ్బు తీసుకొని బెట్టింగ్‌ ఆడాడు. రుణం చెల్లించకపోవడంతో బ్యాంకు ఏజెంట్లతో పాటు లోన్‌ యాప్‌ నిర్వాహకులు డబ్బు కట్టాలని ఫోన్‌ చేస్తున్నారు. వీరి వేధింపులు తాళలేక మానసిక వేదనకు గురయ్యాడు. సెల్‌ఫోన్‌ను ఆఫ్‌ చేయడంతో బంధువులతో పాటు కుటుంబ సభ్యులకు రికవరీ ఏజెంట్లు ఫోన్‌లు చేస్తుండడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. గురువారం సాయంత్రం భార్య పనికి వెళ్లగా ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు.

సాయంత్రం ఇంటికి వచ్చిన భార్య భర్త ఉరికి వేలాడుతూ కనిపించడంతో అత్తాపూర్‌ ఔట్‌ పోస్టు పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి మృతదేహాన్ని మార్చరీకి తరలించారు. మృతుడు తన సూసైడ్‌ నోట్‌లో తన మృతికి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌తో పాటు లోన్‌లు, క్రెడిట్‌ కార్డులు కారణమని తనను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని రాశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

 

చదవండి: Hyderabad: అమాయక మహిళలను మోసం చేస్తూ వ్యభిచార నిర్వహణ 

మరిన్ని వార్తలు