Banjara Hills: కస్టమర్‌కు తెలియకుండా రూ. 11.65 లక్షలు మాయం 

28 May, 2021 09:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బంజారాహిల్స్‌: తన బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి రూ. 11.65 లక్షలు గుర్తు తెలియని వ్యక్తులు విత్‌డ్రా చేశారని ఖాతాదారు ఫిర్యాదు చేశారు.  దీంతో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 10లోని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ పినిసెప్తి గణపతి జూబ్లీహిల్స్‌ పోలీసులకు  ఫిర్యాదు చేశారు. తనకంటే ముందు 2017లో బ్రాంచ్‌ మేనేజర్‌గా పని చేసిన విక్రమ్‌ జయరాజ్‌ కొలగాని ఈ మోసానికి పాల్పడ్డట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.  

అంతర్గత విచారణ చేపట్టగా గతంలో పని చేసిన బ్యాంక్‌మేనేజర్‌ దుర్వినియోగానికి పాల్పడ్డట్లుగా తేలిందన్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విక్రమ్‌ జయరాజ్‌ కొలగానిపై గురువారం క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

అలా.. లక్షల్లో మోసపోయారు 
సాక్షి, సిటీబ్యూరో/బాలానగర్‌:  ఆన్‌లైన్‌ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.సైబర్‌ నేరగాళ్లు సిటీవాసులను టార్గెట్‌ చేసుకొని రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. తీరామోసపోయిన తరువాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆన్‌లైన్‌లో క్యాప్చ ఎంట్రీ ఉద్యోగం పేరుతో వడోదరకు చెందిన వ్యక్తి నిషిద్ధ మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ (ఎంఎల్‌ఎం) దందా నిర్వహించి  18 మందినుంచి 22 రూ.లక్షలు స్వాహా చేశాడు. దీంతో బాధితులు గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వడోదర ప్రాంతానికి చెందిన విపుల్‌ సిమ్హ్‌ చాట్వా డైమండ్‌ అసోసియేట్స్‌ పేరుతో సంస్థ ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో క్యాప్చాలు ఎంట్రీ చేసే జాబ్స్‌ ఇస్తానంటూ ఆన్‌లైన్‌లో పరిచయం చేసుకున్నాడు.

రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లిస్తే రోజూ రూ. 3 వేల క్యాప్చాలు పంపుతానన్నాడు. సూచించిన సైట్‌లో పొందుపరిస్తే ఒక్కో దానికి రూ.1 చొప్పున చెల్లిస్తానని చెప్పాడు.కొద్దిరోజుల పాటు డబ్బులిచ్చి నమ్మించాడు.ఆ తరువాత ఎక్కువ డబ్బు ఆశచూపి ఎరవేసేవాడు. రూ.లక్ష చెల్లించిన వ్యక్తి తనకు రావాల్సిన డబ్బు పొందాలంటే మరికొంత మందిని చేర్పించాల్సి ఉంటుంది. ఇలా పరోక్షంగా నిషిద్ధ మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ వ్యాపారం నిర్వహించాడు. ఇలామోసపోయిన 17 మందిలో 16 మంది ఆ ఒక్కడి ద్వారా ఇందులో చేరిన వారే. మోసపోయామని గుర్తించిన బాధితులు గురువారం సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

ఆశకు వెళ్లి  రూ.12 లక్షలు పోగొట్టుకుంది 
తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశకు పోయిన ఓ మహిళ ఏకంగా రూ.12.91 లక్షలు మోసపోయింది.బాలనగర్‌ సీఐ వాహిద్‌ తెలిపిన మేరకు.. రాజు కాలనీకి చెందిన సౌభాగ్య లక్ష్మి బ్యూటీషియన్‌గా పనిచేస్తుంది. ఈనెల 26న ఆమెకు తెలిసిన మహిళ ద్వారా లైటింగ్‌ పవర్‌ బ్యాంక్‌ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకొని యాప్‌ లో డబ్బులు ఇన్వెస్ట్‌ చేసే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పింది. దాంతో లక్ష్మి యాప్‌ ని డౌన్లోడ్‌ చేసుకొని మొదట కొంత డబ్బు ఇన్వెస్ట్‌ చేసింది. తరువాత డబ్బు వచ్చాయి. అనంతరం యాప్‌ నిర్వాహకులు ఫోన్‌చేసి ఎక్కువ డబ్బు వస్తుందని ఆశచూపాడు. నమ్మిన ఆమె పెద్ద మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్‌ చేసింది. ఆతరువాత మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

చదవండి: 
లైంగికదాడి వీడియో: దొరికిన కామ పిశాచాలు

శభాష్‌ డాక్టర్‌.. హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ ప్రశంస

మరిన్ని వార్తలు