రెండో పెళ్లి కోసం అద్భుతమైన స్టోరీ అల్లాడు

14 Aug, 2021 15:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై : రెండో పెళ్లి కోసం అద్భుతమైన స్టోరీ అల్లాడో వ్యక్తి. తనకు ఇది వరకే పెళ్లైందన్న విషయాన్ని దాచి, తనకు అచ్చంగా తనలాంటి కవల సోదరుడు ఉన్నాడని కాబోయే భార్యకు అబద్ధం చెప్పాడు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నై, అరుంబాక్కానికి చెందిన వాల్లాండర్‌ బెన్నెట్‌ రెయాన్‌ ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేసే 21 ఏళ్ల అమ్మాయితో అతడికి స్నేహం కుదిరింది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లికి అమ్మాయి తరుపు వారు ఒప్పుకున్నారు. రూ.3.5 లక్షలు కట్నంగా ఇచ్చారు. అయితే, ఇద్దరి కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా రెయాన్‌కు ఇదివరకే పెళ్లైందని, పిల్లలు కూడా ఉన్నారని అమ్మాయికి తెలిసింది. దీంతో ఆమె రెయాన్‌ను నిలదీసింది. తనకు అచ్చం తనలాంటి కవల సోదరుడు ఉన్నాడని అబద్ధం చెప్పాడు.

ఇందుకోసం నకిలీ ఓటర్‌ ఐడీ, ఆధార్‌, బర్త్‌ సర్టిఫికేట్‌ను సైతం ఇచ్చాడు. తన కవల సోదరుడు పెళ్లి చేసుకుని దుబాయ్‌లో ఉన్నాడని చెప్పాడు. కొద్దిరోజుల తర్వాత అమ్మాయి బంధువొకరు మరోసారి రెయాన్‌ పెళ్లి గురించి చెప్పారు. ఈ సారి ఆమె కట్నం డబ్బులు వెనక్కు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. దీంతో కోపగించిన అతడు యాసిడ్‌ దాడి చేస్తానని బెదిరించాడు. ఆమె పోలీస్‌ స్టేషన్‌లో అతడిపై, అతడి తల్లి సెలినా రెయాన్‌పై కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

మరిన్ని వార్తలు