మట్టిలో కలిసిపోయిన కానిస్టేబుల్‌

7 Jan, 2021 07:57 IST|Sakshi
జుత్తాడలో ప్రమాద స్థలంలో కానిస్టేబుల్‌ సూర్యనారాయణ  మృతదేహం

మట్టిని తొక్కిస్తుండగా ట్రాక్టర్‌ బోల్తా

కూరుకుపోయి కానిస్టేబుల్‌ మృతి

సాక్షి, చోడవరం టౌన్(విశాఖపట్నం)‌: మట్టిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న కుటుంబం వారిది. కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చినా ఆ పని మానలేదు. ఇటుకల తయారీకి మట్టిని సిద్ధం చేస్తుండగా ట్రాక్టర్‌ బోల్తాపడడంతో ఆ మట్టిలో కూరుకుపోయి ఓ వ్యక్తి మృత్యువాతపడిన హృదయవిదారక సంఘటన  జుత్తాడలో జరిగింది.  గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జుత్తాడ గ్రామానికి చెందిన అంబటి సూర్యనారాయణ(33) విశాఖపట్నంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం విధులు ముగిసిన తరువాత స్వగ్రామం వచ్చాడు. ఇతని తండ్రి ఇటుకల బట్టీ నిర్వహిస్తున్నాడు. దీంతో సూర్యనారాయణ రాత్రి భోజనం చేసిన తరువాత ఇటుకల బట్టీ వద్ద మట్టిని ట్రాక్టర్‌తో తొక్కించడానికి వెళ్లాడు.

మట్టి తొక్కిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్‌ బోల్తాపడింది. సూర్యనారాయణపై ట్రాక్టర్‌  పడడంతో  మట్టిలోకూరుకుపోయి ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడ ఉన్న కూలీలు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సూర్యనారాయణ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి భార్య రేవతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ మునాఫ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బుధవారం మృతదేహన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. సూర్యనారాయణ 2013లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరాడు. తల్లిదండ్రులు,భార్య,ఇద్దరు కుమార్తెలున్నారు. సూర్యనారాయణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

>
మరిన్ని వార్తలు