టీడీపీ మద్దతుదారు నామినేషన్‌లో మద్యంతాగి వ్యక్తి మృతి

8 Feb, 2021 05:55 IST|Sakshi

నామినేషన్‌కు వస్తే బిర్యానీ, మద్యం ఎర

పెద్దపప్పూరు: సర్పంచ్‌ అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమానికి హాజరైన వ్యక్తి అతిగా మద్యం తాగి ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లాలో ఆదివారం ఈ విషాద సంఘటన జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. బుక్కరాయసముద్రం సంజీవపురం గ్రామానికి చెందిన ముసలయ్య (45) పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటలో స్థిరపడ్డాడు. ముచ్చుకోటకు చెందిన టీడీపీ మద్దతుదారు సర్పంచ్‌ స్థానానికి ఆదివారం నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ కార్యక్రమానికి తమవెంట వచ్చే వారికి మద్యం, బిర్యానీ ప్యాకెట్‌ ఇస్తామంటూ ఆయన అనుచరులు ప్రలోభపెట్టారు. ముసలయ్య కూడా ఈ కార్యక్రమానికి వచ్చాడు. అనంతరం షేక్‌పల్లి వద్ద టీడీపీకి చెందిన ఓ వ్యక్తి అరటితోటలో మద్యం తాగారు. ఎక్కువగా తాగిన ముసలయ్య.. కుప్పకూలి మరణించాడు. 

కేసు వద్దంటూ ఒత్తిళ్లు, ప్రలోభాలు
అతిగా మద్యం తాగి వ్యక్తి మరణించిన విషయం తెలుసుకున్న పెద్దపప్పూరు ఎస్‌ఐ మహమ్మద్‌ గౌస్, సిబ్బంది వెంటనే వెళ్లి ముసలయ్య మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించే సమయంలో టీడీపీ వర్గీయులు అడ్డుపడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య దేవి, ఇద్దరు కుమారులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. టీడీపీ నాయకులు వారితో సంప్రదింపులు జరిపారు. పోలీసు కేసు లేకుండా మృతదేహాన్ని తమకు అప్పగించాలంటూ మృతుడి కుటుంబసభ్యులతో కలిసి పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. మృతుడి బంధువులతో తమకెలాంటి కేసులు అక్కర లేదని చెప్పించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించకుండానే అప్పగించేలా చేశారు. అనంతరం ఈ విషయమై ఆందోళన నెలకొనడంతో కేసు నమోదు చేయమని డీఎస్పీ చైతన్య ఆదేశించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు.  

మరిన్ని వార్తలు