ప్రేమకథ విషాదాంతం 

6 Sep, 2020 11:36 IST|Sakshi
మృతి చెందిన భార్యాభర్తలు (ఫైల్‌)

సాక్షి, ఎచ్చెర్ల: ప్రేమించుకున్నారు. కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. కులాల హద్దులను చెరిపేశారు. అడ్డు చెప్పిన పెద్దలను కూడా వద్దనుకున్నారు. ఆలయంలో పెళ్లి చేసుకుని నూతన జీవితంలోకి అడుగుపెట్టారు. ఏడాదిన్నర కూడా కాపురం చేయలేదు. భార్య అనుమానాస్పద మృతి, ఆ ఘటన తట్టుకోలేక మూడు రోజులకే భర్త ఆత్మహత్య. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కథ ఆఖరకు విషాదాంతమైంది. రెండు కుటుంబాలకు కడుపు కోత మిగిల్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్‌ఎల్‌పేట మండలం చింతలబడవంజ గ్రామానికి చెందిన బడాది శిరీష (21), ఎచ్చెర్ల మండలం తోటపాలేం పంచాయతీ పెయిలవానిపేట గ్రామానికి చెందిన బోనెల హేమసుందరావు (24) శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తూ ప్రేమించుకున్నారు.

శిరీష చిన్ననాడే తండ్రి చనిపోవడంతో తల్లి రాజేశ్వరి పెంచి పెద్ద చేసింది. ప్రేమ విషయం తల్లికి చెప్పడంతో ఆమె అంగీకరించలేదు. దీంతో ప్రేమికులు లావేరు మండలం మురపాక గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో 2019 జూన్‌ 21న వివాహం చేసుకున్నారు. అనంతరం పొందూరు సబ్‌ రిజస్ట్రార్‌ కార్యాలయంలో 22న వివాహ రిజస్ట్రేషన్‌ ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. పెయిలవానిపేటలో వరుడి ఇంటిలో కొత్త జీవితం మొదలుపెట్టారు.  

అయితే కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య మనస్ఫర్థలు పొడచూపాయి. ఆ క్రమంలో ఏమైందో గానీ ఈ నెల 2న సాయంత్రం ఒక్కసారిగా శిరీష ఇంట్లోనే అపస్మారక స్థితికి చేరుకుంది. శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి ఆడపడుచు ఆమని ఫోన్‌ ద్వారా శిరీష తల్లి రాజేశ్వరికి సమాచారం ఇచ్చారు. రిమ్స్‌ చేరుకున్న రాజేశ్వరి తన బంధువులతో చర్చించి తన కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని, భర్త కుటుంబ సభ్యులు వరకట్న వేధింపులకు సైతం పాల్పడుతున్నారని ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు విచారణ దశలో ఉండగా శనివారం మృతురాలి భర్త హేమసుందరావు ఆత్మహత్య చేసుకున్నారు. పరిమితికి మించి మత్తు మందు ఇంజెక్షన్‌ డోస్‌ నరానికి ఇచ్చుకున్నట్లు గుర్తించారు. ఉదయం ఎంత సేపటికీ నిద్ర లేవకపోవటంతో తండ్రి రఘు ఎచ్చెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎచ్చెర్ల ఎస్‌ఐ రాజేష్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించే సరికి ఆయన చనిపోయి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

భార్య మృతిపై పోలీస్‌ విచారణ సాగటం, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృతి చెందటం వంటి సంఘటనలతో మానసిక సంఘర్షకు గురై హేమసుందరరావు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆస్పత్రిలో పనిచేస్తుండటం, వైద్యంపై అవగాహన ఉండటంతో మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న జంట ఒకరి వెనుక ఒకరు మృతి చెందటంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నే హితులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు