చైనా మాంజా గొంతు కోసేసింది: కళ్లెదుటే భర్త ప్రాణాలు పోతుంటే..

17 Jan, 2022 11:04 IST|Sakshi
కుటుంబసభ్యులతో భీమయ్య (ఫైల్‌), మృతికి కారణమైన దారం

గుంజపడుగులో విషాదఛాయలు

మాంజా దారం బిగుసుకోవడంతో గొంతు తెగి వ్యక్తి మృతి

మంచిర్యాలలో ఘటన

స్వగ్రామంలో అంత్యక్రియలు

సాక్షి, గొల్లపల్లి (ధర్మపురి): సంక్రాంతి పండుగ పూట ఆ కుటుంబంలో విషాదం నింపింది.. మృత్యురూపంలో వచ్చిన గాలిపటం మాంజా దారం కుటుంబ పెద్దను కబళించింది. బాధిత బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లి మండలం గుంజపడుగుకు చెందిన పస్తం భీమయ్య(45)కు భార్య సారవ్వ, కుమారుడు ప్రవీణ్‌), కూతురు అక్షయ ఉ న్నారు. వీరు బేడబుడగజంగాల వారు. స్వగ్రామంలో ఇల్లు, భూమి, చేయడానికి పని లేకపోవడంతో బతుకుదెరువు కోసం పదేళ్ల కిందట మంచిర్యాల జిల్లా వేంపల్లికి వలస వెళ్లారు. భీమయ్య అక్కడ పాత ఇనుప సామగ్రి కొనుగోలు చేసి, విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇద్దరు పిల్ల లను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు.


ఆస్పత్రికి వెళ్తుండగా ఘటన
ఉన్నదాంట్లో హాయిగా జీవనం సాగిస్తున్న భీమయ్య కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. అతని కాలికి దెబ్బ తగలడంతో సంక్రాంతి రోజు (శని వారం) మంచిర్యాల పట్టణంలోని ఆస్పత్రికి తన ద్విచక్రవాహనంపై భార్య సారవ్వతో కలిసి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గాలిపటం మాంజా దారం భీమయ్య మెడకు చుట్టుకుంది. గట్టిగా బిగుసుకుపోవడంతో గొంతు తెగి, అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కళ్లెదుటే భర్త ప్రాణాలు పోవడంతో సారవ్వ రోదనలు మిన్నంటాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

చదవండి: (అయ్య బాబోయ్‌.. రికార్డు స్థాయిలో చికెన్‌ లాగించేశారు)

కంటతడి పెట్టిన స్థానికులు
బతుకుదెరువు కోసం మంచిర్యాల జిల్లాకు వెళ్లిన భీమయ్య ఏటా సంక్రాంతికి తన కుటుంబసభ్యులతో కలిసి స్వగ్రామం వచ్చేవాడు. ఈసారి కాలికి దెబ్బ తాకడంతో రాలేదు. పండుగ రోజు ఆస్పత్రికి వెళ్తుంటే చనిపోయాడని తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహం ఆదివారం గుంజపడుగు చేరడంతో చూసేందుకు వచ్చిన స్థానికులు కంటతడి పెట్టారు.

2017లో నిషేధం
రసాయనాలు పూసిన చైనా మాంజా దారంతో పక్షుల ప్రాణాలు పోతున్నాయని 2017లో రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ కూడా గతంలోనే గాజు పూత పూసిన నైలాన్‌ లేదా సింథటిక్‌ చైనా మాంజాను అనుమంతించవద్దని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మాంజా విక్రయించినా, కొనుగోలు చేసినా ఒకటి నుంచి ఐదేళ్ల జైలుశిక్ష లేదా రూ.లక్ష జరిమానా లేదంటే రెండూ విధించేలా ప్రభుత్వం చట్టం చేసింది. అయిన మాంజా దారం విక్రయాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో నిషేధించిన ఈ దారం ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో మంచిర్యాల పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు