Viral: అసలేం జరిగింది.. నెల రోజులుగా జీడి చెట్టుకు వేలాడుతున్న మృతదేహం ?

23 Nov, 2021 15:24 IST|Sakshi
బోర ధర్మారావుదిగా భావిస్తున్న మృతదేహం

బోడికొండలో వ్యక్తి మృతదేహం లభ్యం

జీడిచెట్టుకు వేలాడుతున్న మృతదేహం

మృతుడిది మెళియాపుట్టి మండలమని నిర్ధారణ

సాక్షి,పాతపట్నం(శ్రీకాకుళం): అలికిడి లేని చిన్న అడవి. ఎప్పుడో గానీ మనుషులు తిరగని ప్రదేశం. అక్కడ ఓ జీడి చెట్టు. దానికి నెల రోజులుగా వేలాడుతున్న ఓ వ్యక్తి మృతదేహం. వినేందుకు ఏదో క్రైమ్‌ కథను తలపిస్తున్న ఈ ఘటన మెళియాపుట్టి మండలం పెద్దపద్మాపురం పంచాయతీ మామిడిగుడ్డి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని క్వారీ కొండ వెనుక ఉన్న బోడి కొండపై నెల రోజుల కిందట చనిపోయిన వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైంది. (చదవండి: అయ్యో భగవంతుడా.. తండ్రి కారు కాటికి పంపింది

పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు..   మామిడిగుడ్డి గ్రామానికి చెందిన సవర గణేష్‌ సోమవారం వంట కలప కోసం కొండపైకి వెళ్లాడు. అటుగా తిరుగుతుండగా ఓ జీడి చెట్టుకు మృతదేహం వేలాడుతూ ఉండడం చూసి భయపడ్డాడు. వెంటనే స్థానికులతో పాటు పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహంతో పాటు పరిసరాలను పరిశీలించారు. పాతపట్నం సీఐ ఎం.వినోద్‌ కుమార్, పాలకొండ సబ్‌ డివిజన్‌ క్లూస్‌ టీమ్‌లు కొండపైకి వెళ్లి ఆ చెట్టు చుట్టూ నిశితంగా పరిశీలించారు. మృతదేహం పరిసరాల్లో నాటుసారా బాటిల్‌ కనిపించింది. నెల రోజుల కిందట మృతి చెంది ఉండవచ్చని వారు భావిస్తున్నారు.  

మృతదేహం బాగా పాడైపోయి ఉండడంతో మెళియాపుట్టి మండలంలో ఇటీవల నమోదైన మిస్సింగ్‌ కేసులను పరిశీలించారు. అదే మండలం కొసమాల గ్రామానికి చెందిన బోర ధర్మారావు (54)గా అదృశ్యమైనట్లు గుర్తించారు. నిర్ధారణ కోసం ధర్మారావు  బావమరిది పుడితిరు మల్లేసును అక్కడకు తీసుకువచ్చి మృతదేహాన్ని చూపించగా అది ధర్మారావేనని గుర్తు పట్టారు. కొసమాల గ్రామానికి చెందిన బోర ధర్మారావు కుమారులు నర్సిమూర్తి, వినోద్‌ కుమార్‌లు గత నెల 19వ తేదీన మెళియాపుట్టి పోలీసు స్టేషన్‌లో తమ తండ్రి అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును అనుసరించి దర్యాప్తు చేయగా మృతుడి వివరాలు తెలిశాయి. పాతపట్నం సీహెచ్‌సీ వైద్యుడు ఐ.శ్రీధర్‌ మృతదేహానికి అక్కడే శవ పంచనామా చేశారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని, సవర గణేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.  

చదవండి: వివాహేతర సంబంధం: నమ్మించి లాడ్జికి తీసుకువెళ్లి..

     

మరిన్ని వార్తలు