అనుమానాస్పద మృతి.. మర్మాంగాలపై తీవ్రంగా కొట్టి..

21 Dec, 2021 09:06 IST|Sakshi

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి 

భూమి పంచాయితీ ముందు రోజు ఘటన 

హత్య చేశారని ఆరోపిస్తున్నకుటుంబీకులు

పోస్టుమార్టం రిపోర్టు కీలకమన్న పోలీసులు

సిరిసిల్లక్రైం/సిరిసిల్లఅర్బన్‌: జిల్లా కేంద్రంలోని రెండో బైపాస్‌రోడ్డులో సిరిసిల్ల మున్సిపల్‌ పరిధి రగుడు గ్రామానికి చెందిన వంగ వీరయ్య(52) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. 19 గుంటల భూమి పంచాయితీ తమ కుటుంబ పెద్ద దిక్కును బలి తీసుకుందని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తుండగా, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. 

వివాదానికి కారణాలు
వివాదానికి గల కారణాలను కుటుంబ సభ్యులు వివరించారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధి రగుడు ఎల్లమ్మ ఆలయం ఎదురుగా తెట్టకుంట శివారులోని సర్వేనంబర్‌ 51/2లో 19 గుంటల స్థలాన్ని ఆరేళ్ల క్రితం వంగ వీరయ్య, వంగ హన్మండ్లు కొనుగోలు చేశారు. దీన్ని ఓర్వలేని వారి బంధువులు ఆ భూమి గౌడ కులస్తులకు చెందితే బాగుంటుందని ఇద్దరిపై పంచాయితీకి ఉసిగొల్పారు. ఈ విషయమై సిరిసిల్లటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ అనిల్‌కుమార్‌ ఇరువర్గాలను పిలిచి అడుగగా, పంచాయితీ నిర్వహించుకుని సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు.

ఇందులో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు పంచాయితీ నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం ఆదివారం రాత్రి పంచాయితీ పెద్దలను పిలవడానికి వీరయ్య ఒకవైపు, హన్మండ్లు మరోవైపు వెళ్లారు. పెద్దలను కలిసిన వీరయ్య ఇంటికి వస్తున్నానని కుటుంబీకుల్లో ఒకరికి రాత్రి 9 గంటల ప్రాంతంలో ఫోన్‌ చేశాడు. తర్వాత ఎలాంటి సమాచారం రాలేదు. ఉదయం సిరిసిల్ల రెండో బైపాస్‌లో వీరయ్య మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

హత్య చేశారని ఆరోపణలు
భూమి విషయంలో తగాదాలను మనసులో పెట్టుకుని వీరయ్యను హత్య చేసినట్లు కుటుంబీకులు ఆరోపించారు. బైక్‌ నుంచి పడితే కేవలం తల మాత్రమే ఎలా పగులుతుందన్న అనుమానాలున్నాయి. అంతేకాకుండా మృతుడి మర్మాంగాలపై తీవ్రంగా కొట్టారని మృతదేహాన్ని చూసిన స్థానికుల్లో కొందరు ఆరోపించారు. పంచాయితీ రోజుకు ముందు కొన్ని గంటల వ్యవధిలో ఎవరో కావాలని హత్యచేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం 
వీరయ్యకు భార్య రేణుక, ముగ్గురు కూతుళ్లు శ్రావణి, ప్రవళిక, మానస, కుమారుడు ప్రణయ్‌ ఉన్నారు. పెద్దమ్మాయికి వివాహం జరిగింది. మిగతావారు చదువుకుంటున్నారు. కల్లుగీత కార్మికుడిగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈక్రమంలో ఇంటి పెద్ద మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

న్యాయం చేయాలని వేడుకోలు 
తమ కుటుంబ పెద్దను చంపిన వ్యక్తులను పట్టుకుని న్యాయం చేయాలని వీరయ్య భార్య అతడి పిల్లలు టౌన్‌ సీఐ అనిల్‌కుమార్‌ను వేడుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, కేసును అనుమానాస్పదంగా భావించి 174 సెక్షన్‌లో నమోదు చేశామని, పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు హత్యగా 30 శాతం తెలిపినా మర్డర్‌ కేసుగా అల్టర్‌ చేస్తానని హామీ ఇచ్చారు. హత్య అని తేలితే ఎంత పెద్ద మనుషులున్నా వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

చదవండి: Balanagar: ప్రేమ పేరుతో మోసం.. శారీరకంగా లొంగదీసుకొని.. చివరకు

మరిన్ని వార్తలు