పాపం ఆమెకు తెలియదు.. భర్త శవమై వస్తున్నాడని..!!

10 Jan, 2021 07:21 IST|Sakshi
భర్త కోసం పసికందుతో ఎదురు చూస్తున్న మంగమ్మ

సాక్షి, కలకడ : ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న 16 ఏళ్ల యువతిని విధి చిన్నచూపు చూసింది. రోడ్డు ప్రమాదం ఆమె భర్తను కబళించింది. ఐదు రోజుల పసికందుతో పచ్చి బాలింతగా ఉన్న ఆ యువతికి అంతులేని విషాదం మిగిల్చింది. ఈ విషాద సంఘటన మండలంలోని ఇందిరమ్మ కాలనీలో చోటుచేసుకుంది.  హెడ్‌కానిస్టేబుల్‌ సునీల్‌కుమార్‌ కథనం.. మండలంలోని వడ్డిపల్లెకు చెందిన పీట్ల.క్రిష్ణయ్య కుమారుడు పి.గంగాధర (25) కూలిపనులతోపాటు ఆటోడ్రైవర్‌గా ఉంటూ కుటుంబాన్ని పోషించేవాడు. గ్రామానికి చెందిన తన బంధువుల అమ్మాయి మంగమ్మను ప్రేమించాడు. చదవండి: (విషాదం: గుండెపోటుతో జగదీష్‌.. మనోవేదనతో శిరీష..)

పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా ఏడాదిన్నర క్రితం ఆమెను వివాహం చేసుకున్నాడు. అనంతరం స్థానిక ఇందిరమ్మ కాలనీకి తన నివాసం మార్చాడు. ఫైనాన్స్‌ కింద టాటా సుమో తీసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల క్రితం మంగమ్మ ప్రసవించడంతో వారి ఇంట కొత్త వెలుగు వచ్చినట్లైంది. ఆమె అత్తమామలు తాము అవ్వాతాతలు అయ్యామని సంబరపడ్డారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తన ద్విచక్రవాహనంలో కలకడ నుంచి ఇందిరమ్మ కాలనీకి వస్తూ గంగాధర మృత్యువాత పడ్డాడు. మార్గమధ్యంలో అదుపుతప్పి చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై పడిపోయాడు. 

గాయపడిన అతడిని స్థానికులు 108లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం గంగాధర మృతి చెందాడు. మృతుని పిన తండ్రి రఘునాథ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్‌ సునీల్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు మరణించాడనే అంతులేని దుఃఖం గుండెను పిండేస్తున్నా కోడలికి వద్ద అత్తమామలు ఇది దాచారు. ప్రమాదంలో తలకు చిన్నగాయమై ఆస్పత్రిలో ఉన్నాడని చెప్పడంతో నిజమేనని భావించి ఇంటి గడప వద్దే పసికందుతో బేలచూపులతో ఎదురుచూస్తోంది. చదవండి: (స్రవంతి ఇక లేదు..)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు