దారుణం: వృద్ధుడి తలపై నుంచి దూసుకెళ్లిన బైక్‌

16 Aug, 2021 08:14 IST|Sakshi

సాక్షి, న‌ల్ల‌కుంట‌( హైద‌రాబాద్‌): టూ వీలర్‌పై వెళుతున్న ఓ విశ్రాంత ఉద్యోగి ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడిపోయాడు. అదే సమయంలో మరో ద్విచక్ర వాహనంపై వేగంగా దూసుకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి రోడ్డుపై పడిపోయిన బాధితుడి తలపై నుంచి దూసుకువెళ్లాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  విశ్రాంత ఉద్యోగి ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

ఎస్‌ఐ రవి కథనం ప్రకారం.. అంబర్‌పేట చెన్నారెడ్డి నగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి మామిళ్ల సత్యనారాయణ (70) శనివారం సాయంత్రం మెడిసిన్‌ కొనుకునేందుకు విద్యానగర్‌లో డీడీహెచ్‌ ఆస్పత్రికి వచ్చాడు. మెడిసిన్స్‌ తీసుకున్న తర్వాత హీరో హోండా (ఏపీ29ఏహెచ్‌ 4396) బైక్‌పై ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాడు. మెయిన్‌ రోడ్డుకు చేరుకున్న అతను లెఫ్ట్‌ టర్న్‌ తీసుకునే సమయంలో బైక్‌ అదుపు తప్పి కిందపడిపోయాడు. అదే సమయంలో విద్యానగర్‌ లక్కీ కేఫ్‌ చౌరస్తా నుంచి ద్విచక్ర వాహనంపై వేగంగా దూసుకువచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డుపై పడిపోయిన సత్యనారాయణ తలపై నుంచి దూసుకుపోయాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి సత్యనారాయణ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ నుంచి అతని కుమార్తె గంగపురం కరుణకు ఫోన్‌చేసి విషయం తెలియజేయగా ఆమె కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కాగా అక్కడ చికిత్స పొందుతున్న సత్యనారాయణ ఆదివారం  మృతి చెందాడు. తన తండ్రి మృతికి కారణమైన వ్యక్తిపై  చర్యలు తీసుకోవాలని మృతుడి కుమార్తె కరుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు