పండగ పూట పెను విషాదం

10 Sep, 2021 11:11 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్‌ గోవింద

నరసన్నపేట(శ్రీకాకుళం): మండలంలోని రావాడపేట వద్ద అంతర్‌రాష్ట్ర జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. వినాయక విగ్రహాలు కొనుగోలుకు వస్తూ ఒకరు.. ఉప్పు అమ్మకాలు చేసి ఇంటికీ వెళ్తూ మరొకరు మృత్యువాత పడటంతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయా యి. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. 

ఎప్పటిలాగే ఉదయానికే ఇంటి నుంచి
జలుమూరు మండలం దరివాడ గ్రామానికి చెందిన చింతు రామారావు(50) లగేజీ ఆటోపై ఉప్పు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఎప్పటిలాగే గురువారం ఉదయానికే ఇంటి నుంచి బయలుదేరి వ్యాపారం ముగించుకొని ఇంటికి పయనమయ్యాడు. అలాగే  గార మండలం తూలుగుకు చెందిన పిట్ట గోవిందరావు సరియాపల్లిలో తన బంధువుల ఇంటికి ఆటోపై వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలో కొందరు ప్రయాణికులను ఎక్కించుకొని నరసన్నపేట వైపు బయలుదేరాడు. రెండు ఆటోలు రావాడపేట వద్దకు వచ్చే సరికి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో గోవిందరావు ఆటోలో ఉన్న ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు. రామారావు ఆటో కింద చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

నరసన్నపేటలో వినాయక విగ్రహాలు కొనుగోలు చేసేందుకు తన మిత్రులతో కలిసి ఆటోలో వస్తున్న సారవకోట మండలం కొత్తూరుకు చెందిన ఇంటర్‌ విద్యార్థి దాసరి శ్యామ్‌సుందరరావు(17) తీవ్రంగా గాయపడటంతో నరసన్నపేట ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇదే ఘటనలో బురద కొత్తూరుకు చెందిన భార్గవ, సింహాద్రి, ఆటో డ్రైవర్‌ గోవిందరావు గాయపడ్డారు. వీరంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు మహిళలతో పాటు మరో ఇద్దరు పిల్లలు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఘటనా స్థలాన్ని నరసన్నపేట ఎస్సై వి.సత్యనారాయణ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కొత్తూరులో విషాదఛాయలు 
సారవకోట: శ్యామసుందరరావు మృతితో కోదడ్డపనస పంచాయతీ కొత్తూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో సరదాగా ఉండే తమ కుమారుడు ఆకస్మికంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు మణమ్మ, కామేశ్వరరావులు కన్నీటి పర్యంతమయ్యారు.  

చదవండి: సైదాబాద్‌లో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు