జమ్మికుంటలో విషాదం: పోలీస్‌ సైరన్‌ విని.. పరిగెత్తి

2 Nov, 2021 07:51 IST|Sakshi
ప్రమాదానికి కారణమైన బావి, వేణు (ఫైల్‌)

బావిలో పడి వ్యక్తి దుర్మరణం

మిన్నంటిన కుటుంబసభ్యుల రోదనలు

జమ్మికుంట దుర్గా కాలనీలో విషాదం

సాక్షి, జమ్మికుంట(కరీంనగర్‌): పోలీస్‌ సైరన్‌ ఓ వ్యక్తిని మృత్యుఒడికి చేర్చింది. రాత్రి సమయంలో స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా సైరన్‌ వినిపించడంతో పరిగెత్తి, ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ప్రకారం.. మోత్కులగూడెంకు చెందిన పొన గంటి వేణు(34) జమ్మికుంట మున్సిపాలిటీ పరిధి లోని దుర్గా కాలనీలో ఉంటున్నాడు. ఇతనికి భార్య స్వాతి, ఆరేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు అద్విక, కృత్రిక ఉన్నారు. వేణు ఓ ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ పని చేస్తున్నాడు.

దీంతోపాటు తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి తన ముగ్గురు స్నేహితులతో కలిసి, జమ్మికుంట ప్రధాన రహదారికి సమీపంలోని ఓ రెస్టారెంట్‌ ఎదురుగా మద్యం తాగుతున్నాడు. పెట్రోలింగ్‌ చే స్తున్న పోలీసులు సైరన్‌ మోగించడంతో నలుగురు నాలుగు దిక్కులకు పురుగులు పెట్టారు. దీంతో వేణు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయాడు. అక్కడికి దగ్గరలో ఉన్న పలువురికి బావిలో ఏదో పడిన శబ్ధం వినిపించడంతో వెంటనే వెళ్లారు.
చదవండి: రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. అనంతరం నీళ్లులేని ట్యాంకులో పడేసి

చీకట్లోనే ప్రమాదకరంగా ఉన్న బావిలో ముగ్గురు దూకి, గాలించారు. అయినా అతని ఆచూకీ లభించలేదు. కొక్కేలతో ఉన్న బకెట్‌కు తాగు కట్టి, వెతకగా వేణుకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో చాలాసేపు వెతికి అతన్ని బయటకు తీశారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

 

వేణు (ఫైల్‌), వేణు కూతుళ్లు

డాడీ.. లే డాడీ..
సోమవారం వేణు మృతదేహం ఇంటికి చేరింది. డాడీ.. లే డాడీ.. ఫోన్‌ చేస్తే వస్తున్న అన్నావు.. మమ్మీ.. డాడీ లేస్తలేడు చెప్పు.. అంటూ వేణు పెద్ద కూతురు తండ్రి మృతదేహంపై పడి, విలపించడం చూసి, స్థానికులు కంటతడి పెట్టారు. తండ్రి చితికి పెద్ద కూతురు అద్విక నిప్పంటించింది.  

ఇదే మండలంలో గతంలోనూ ఓ ఘటన
ఇల్లందకుంట మండలంలోని మల్యాల శివారులో గతంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు మద్యం సేవిస్తుండగా పోలీస్‌ సైరన్‌ వినబడటంతో పరిగెత్తి, బావిలో పడి మృతిచెందాడు. కొన్ని సందర్భాల్లో అవసరం లేకున్నా పోలీసులు సైరన్‌ వేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని పలువురు అంటున్నారు.

మరిన్ని వార్తలు