యువకుడికి గుండెపోటు.. ‘నీకు ఏం కాదు శీను.. ధైర్యంగా ఉండు’.. అంతలోనే!

25 Nov, 2022 12:54 IST|Sakshi
శ్రీనివాస్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్న షఫీ, శ్రీనివాస్‌ (ఫైల్‌) 

సాకక్షి, హుజూరాబాద్‌: గుండెనొప్పితో విలవిల్లాడుతున్న యువకుడికి తన స్నేహితుడు నోటితో శ్వాస అందించాడు.. బతికిచ్చుకునేందుకు అన్ని విధాల ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. చికిత్స అందేలోపు యువకుడు మృతిచెందాడు. ఈ విషాద ఘటన వీణవంక మండలం ఘన్ముక్కులలో జరిగింది. గ్రామస్తుల వివరాలు.. గ్రామానికి చెందిన బడిమే శ్రీనివాస్‌(38) ఎలక్ట్రీషియన్‌.

గురువారం తన వ్యవసాయ క్షేత్రంలోని విద్యుత్‌ మోటార్‌ను మరమ్మతు చేసేందుకు తండ్రి కొమురయ్యతో కలిసి వెళ్లాడు. మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా చాతిలో నొప్పి వచ్చింది. ఏదో జరుగుతుందని గ్రహించి స్థానిక వైద్యున్ని ఆశ్రయించాడు. అప్పటికే పరిస్థితి విషమిస్తుండడంతో శ్రీనివాస్‌ అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు ఎండీ షఫీకి సమాచారం అందించాడు. వెంటనే అతడు కారులో జమ్మికుంట ఆసుపత్రికి తరలిస్తుండగా ఎఫ్‌సీఐ గోదాం వద్దకు చేరుకోగానే కారులో శ్రీనివాస్‌ కుప్పకూలాడు.

నోటితో శ్వాస అందించినా..
శ్రీనివాస్‌కు చాతి నొప్పి తీవ్రం కావడంతో అప్రమత్తమైన షఫీ వెంటనే కారును నిలిపివేసి కాపాడే ప్రయత్నం చేశాడు. చాతిపై ఒత్తాడు. నోటితో 2 నిమిషాల పాటు శ్వాస అందించాడు. తన స్నేహితుడు కళ్ల ముందే విలవిల్లాడుతుంటే తట్టుకోలేకపోయాడు. ‘నీకు ఏం కాదు ధైర్యంగా ఉండు శీను.. నీవు బతుకుతావు’ అంటూ రోదించాడు. బతికించాలంటూ అక్కడికి చేరుకున్న జనాన్ని బతిమిలాడాడు. 108 వాహనం చేరుకోవడంతో వెంటనే జమ్మికుంటలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే శ్రీనివాస్‌ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. బతుకుతాడనుకున్న కానీ ఇంత దారుణం జరుగుతదని అనుకోలేదని షఫీ కన్నీరుమున్నీరయ్యాడు.  మృతుడికి భార్య కోమల, కూతురు, కుమారుడు ఉన్నారు. 
చదవండి: ‘దొంగ కానిస్టేబుల్‌’ ఈశ్వర్‌.. డబ్బు ‘తీసుకోవడం’తోనే గుట్టు వీడింది! 

మూడేళ్లుగా వాకింగ్‌ చేసినా..
శ్రీనివాస్‌ తన స్నేహితులతో కలిసి రోజూ ఉదయం వాకింగ్‌ చేసేవాడు. ఘన్ముక్కుల నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కిష్టంపేట వరకు వెళ్లి వచ్చేవాడు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తాపత్రయపడేవాడని శ్రీనివాస్‌ స్నేహితులు తెలిపారు. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు