చేనుపనులు ముగించుకుని వస్తున్నాడు.. అంతలోనే

2 Oct, 2021 08:34 IST|Sakshi

సాక్షి, జైనథ్‌(ఆదిలాబాద్‌): చేను పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తాడనుకుంటే భర్త పిడుగుపాటుకు గురై తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటన జైనథ్‌ మండలం గూడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుంట భగవాండ్లు(49), తన భార్య మల్లమ్మ, జీతగాడు(పాలేరు) దాగిరి సంతోశ్, మరో నలుగురు కూలీలతో కలసి శుక్రవారం తన పత్తి చేనులో కలుపు నివారణ, పురుగుల మందు పిచికారీ పనులకు వెళ్లారు.

ఆ తర్వాత కూలీలతో కాలినడకన భార్య మల్లమ్మ ఇంటికి చేరుకుంది. సాయంత్రం తిరిగి వస్తున్న క్రమంలో పాలేరు సంతోశ్‌ ఎడ్ల బండి తోలుతుండగా, వెనుకాల నిల్చోని భగవాండ్లు వస్తున్నాడు. ఎడ్లబండిపై ఒకసారిగా పిడుగుపడి భగవాండ్లు అక్కడిక్కడే మృతిచెందాడు. సంతోశ్‌కు కాలి భాగంలో గాయాలయ్యాయి. ఎడ్లకు సైతం స్వల్ప గాయాలు కాగా, ఎటువంటి హాని జరుగలేదు. స్థానికులు సంతోశ్‌ను జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు  ఉన్నారు.

చదవండి: విధుల్లో ఉన్న వలంటీర్‌పై టీడీపీ నేత దాడి

మరిన్ని వార్తలు