షాపింగ్‌ మాల్‌లో నైట్‌ పార్టీ..  900 మంది యువతీ యువకుల హల్‌చల్‌

23 May, 2022 09:33 IST|Sakshi

సాక్షి, చెన్నై: కోయంబేడు సమీపంలోని ఓ మాల్‌లో నైట్‌ పార్టీలో మద్యం ఏరులై పారింది. అతిగా విదేశీ మద్యం తాగిన యువకుడు మృతి చెందడంతో  పార్టీ గుట్టు రట్టయ్యింది. దీంతో ఈ ఘటన తమిళనాడుతో చర్చనీయాంశంగా మారింది. 

కాగా, చెన్నై శివారు ప్రాంతాలు, నగరంలో ఇటీవల కాలంగా వీకెండ్‌ పార్టీలు జోరందుకుంటున్నాయి. పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నా, తగ్గేదే లేదన్నట్లుగా నిర్వాహకులు ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో నగరం నడి బొడ్డున ఉన్న కోయంబేడు సమీపంలోని ఓ మాల్‌లో నైట్‌ పార్టీ (అనుమతి లేకుండా) సాగడం వెలుగులోకి వచ్చింది. ఈ మాల్‌లోని పై అంతస్తును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని ఈ నైట్‌ పార్టీ నిర్వహించారు.

 బ్రిజిల్‌ నుంచి ప్రముఖ డీజే మన్డ్రో గ్రోవా బృందం ఈ పార్టీలో రాక్‌ మ్యూజిక్‌ను హోరెత్తించింది. విదేశీ మద్యం ఈ పార్టీలో ఏరులై పారింది. ముందుగా రూ.1500 చెల్లించి రిజర్వు చేసుకున్న 900 మంది యువతీ యువకులను ఈ పార్టీకి నిర్వాహకులు అనుమతించారు. రాక్‌ మ్యూజిక్‌ , ఏరులై పారిన మద్యంతో యువత చిత్తయ్యారు. అతిగా మద్యం సేవించిన ఓ యువకుడు స్పృహ తప్పిన సమాచారంతో ఈ పార్టీ గుట్టు రట్టు అయింది.

 సమాచారం అందుకున్న అన్నానగర్‌ పోలీసులు రంగంలోకి దిగారు. పార్టీని అడ్డుకున్నారు. అక్కడున్న యువతను బయటకు పంపించేశారు. నిర్వాహకులు విఘ్నేష్‌, చిన్న దురై,  భరత్, మార్క్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్పృహ తప్పిన యువకుడు ఆస్పత్రిలో మరణించడంతో వివాదం పెద్దదైంది. దీంతో నిర్వాహుకులపై కేసులు నమోదయ్యాయి. మృతి చెందిన యువకుడు మరిపాక్కంకు చెందిన  ప్రవీణ్‌(23)గా గుర్తించారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వందలాది విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ పార్టీలో మత్తు పదార్థాల వాడకంపై అనుమానాలు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. 

ఇది కూడా చదవండి: నవ వధువు సృజన మృతిపై వీడిన మిస్టరీ.. వెలుగులోకి అసలు నిజాలు

మరిన్ని వార్తలు