హ్యాపీ బర్త్‌డే అంటూ వాట్సాప్‌ స్టేటస్‌లు... సాయంత్రానికే ఘోరం..

29 Dec, 2021 13:04 IST|Sakshi

సాక్షి, జన్నారం(ఖానాపూర్‌): పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకుని ఆనందంగా గడిపిన యువకుడికి ఆ రోజే వందేళ్లు నిండాయి. బర్త్‌డే రోజు కొత్త మొబైల్‌ కొనుక్కుంటానని ఇంట్లో చెప్పి వెళ్లిన అతడిని టాటాఏస్‌ వాహనం రూపంలో వచ్చిన మృత్యువు బలితీసుకుంది. ఈ విషాదకర ఘటన జన్నారం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. మృతుడి అన్నయ్య జూల రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలం అక్కపెల్లిగూడ గ్రామానికి చెందిన జూల మల్లయ్య, పోశవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్నకుమారుడు శివకృష్ణ(20) హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నాడు.

క్రిస్మస్‌ సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చాడు. మంగళవారం పుట్టిన రోజు కావడంతో స్నేహితులతో గడిపి, మొబైల్‌ కొనేందుకు బైక్‌పై జన్నారానికి బయల్దేరాడు. ఇందన్‌పల్లి వద్ద వేగంగా వచ్చిన టాటాఏస్‌ వాహనం శివకృష్ణ బైక్‌ను ఢీకొట్టింది. చాలా సేపయినా ఇంటికి రాకపోవడంతో రామకృష్ణ ఫోన్‌ చేసినా కలువలేదు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒకరు ఫోన్‌ చేసి ‘శివకృష్ణకు యాక్సిడెంట్‌ అయింది, తీవ్రంగా గాయపడ్డాడని’ తెలిపాడు. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని 108 వాహనంలో శివకృష్ణను స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచనల మేరకు మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.  


చదవండి: అక్రమ కట్టడాలపై మున్సిపల్‌ శాఖ నజర్‌.. బీపాస్‌’తప్పనిసరి.. బైపాస్‌ లేదు! 

ఉదయం శుభాకాంక్షలు..  రాత్రికి నివాళి 
శివకృష్ణ పుట్టినరోజు సందర్భంగా బంధువులు, స్నేహితులు మంగళవారం ఉదయం శుభాకాంక్షలు తెలుపుతూ తమ మొబైల్‌లో వాట్సాప్‌ స్టేటస్‌లు పెట్టుకున్నారు. అంతలోనే అతను మృతి చెందిన విషయం తెలియడంతో రిప్‌ అంటూ నివాళులర్పించారు. ఈ ప్రమాద విషయంపై ఎస్సై మధుసూదన్‌రావును సంప్రదించగా యువకుడు మృతి చెందిన విషయం నిజమేనని, కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు.  
చదవండి: ట్యాంక్‌బండ్‌పై రోడ్డు ప్రమాదం.. మూడేళ్ల చిన్నారి దుర్మరణం

మరిన్ని వార్తలు