రిసెప్షన్‌కు వెళ్తూ.. అనంతలోకాలకు..

24 Feb, 2022 08:07 IST|Sakshi

ఆర్టీసీ బస్సు ఢీకొని గర్జనపల్లి టీఆర్‌ఎస్‌ నాయకుడు మృతి 

కొత్తపల్లి(కరీంనగర్‌): శుభకార్యానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టీఆర్‌ఎస్‌ నాయకుడు మృతిచెందాడు. కొత్తపల్లి ఎస్సై బి.ఎల్లయ్యగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన మాజీ సర్పంచ్‌ భర్త గొల్లపల్లి కిషన్‌(52) బుధవారం  కరీంనగర్‌లో జరిగే వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో చింతకుంట పంచాయతీ పరిధిలోని కరీంనగర్‌–వేములవాడ ప్రధాన రహదారిపై ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల సమీపంలో వెనకనుంచి వచ్చిన కరీంనగర్‌–1 డిపో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

ఈ ఘటనలో కిషన్‌ కిందపడగా బస్సు టైరు ఆయన నడుము పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యా యి. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కిషన్‌ను 108 వాహనంలో కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా మధ్యాహ్నం మృతిచెందాడు. బస్సును అజాగ్రత్తగా నడిపి, తన భర్త మృతికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్‌పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు