ఒక్కడే కుమారుడు.. దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ..

24 Nov, 2021 11:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నెల్లిమర్ల(శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి పుణ్యక్షేత్రంలోని సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుని వస్తూ ఓ అయ్యప్ప మాలధారుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. నెల్లిమర్ల పట్టణంలోని చంపావతి నదిలో స్నానానికి దిగి మునిగిపోయారు. తోటి అయ్యప్ప మాలధారులు, నెల్లిమర్ల ఎస్‌ఐ రవీంద్రరాజు అందించిన వివరాల ప్రకారం.. విజయనగరంలోని అయ్యకోనేరు సమీపంలోని గుమ్చీ ప్రాంతానికి చెందిన బత్తుల చంటి(21) మరో ఐదుగురు అయ్యప్ప మాలధారులతో కలిసి మంగళవారం వేకువజామున శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలోని  సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లారు.

దర్శనం అనంతరం స్వాములంతా కలిసి విజయనగరానికి బయలుదేరారు. నెల్లిమర్ల మీదుగా తిరిగి వస్తూ పట్టణంలోని మొయిద వంతెన సమీపంలో చంపావతి నదిలోకి అందరూ స్నానానికి దిగారు.  నదిలో కాస్త వరద ఎక్కువగా ఉండటంతో చంటి మునిగిపోయారు. మిగిలిన స్వాములంతా ఆయనను రక్షించడానికి ప్రయత్నించారు. అయినా వారి ప్రయత్నం ఫలించలేదు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు.

తల్లిదండ్రులు సత్యనారాయణ, రమ్మణమ్మ చిన్న టిఫెన్‌ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. చంటి మెయిన్‌ రోడ్డులోని వానపాము పూజా సామాగ్రి షాపులో పని చేస్తున్నారు. చంటి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ అయ్యప్ప కూడా దీక్షలో ఉన్న తమ కొడుకును కాపాడలేకపోయారని బోరుమన్నారు. ఎస్‌ఐ రవీంద్రరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: Viral: అసలేం జరిగింది.. నెల రోజులుగా జీడి చెట్టుకు వేలాడుతున్న మృతదేహం ?

మరిన్ని వార్తలు