లోన్‌ యాప్‌ వేధింపులకు యువకుడు బలి

9 Jan, 2021 08:10 IST|Sakshi
మల్లుగారి పవన్‌కళ్యాణ్‌రెడ్డి(ఫైల్‌ ఫొటో)

ఇల్లంతకుంట(మానకొండూర్‌): లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులు భరించలేక యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గాలిపల్లికి చెందిన మల్లుగారి పవన్‌కళ్యాణ్‌రెడ్డి (22) కరీంనగర్‌లో డిగ్రీ పూర్తిచేసి ఇంట్లోనే ఉంటున్నాడు. వ్యక్తిగత అవసరాలకు ఇటీవల ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ ద్వారా రుణం తీసుకున్నాడు. కొద్దిరోజుల క్రితం తన సోదరి వద్ద రూ.10,000 తీసుకుని కొంత అప్పు తీర్చాడు. మిగతా డబ్బు కోసం లోన్‌యాప్‌ నిర్వాహకులు పవన్‌కళ్యాణ్‌రెడ్డిని వేధించడంతోపాటు అతడి సోదరికి కూడా ఫోన్‌ చేశారు. (చదవండి: అగ్ని ప్రమాదం.. 10 మంది శిశువులు మృతి)

ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయేమోననే భయంతో శుక్రవారం తెల్లవారుజామున పవన్‌ ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నాడు. అయితే, పవన్‌కళ్యాణ్‌రెడ్డి ఎంత మొత్తం రుణం తీసుకున్నాడనేది ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు. అప్పు విషయం తల్లిదండ్రులకు చెప్పకపోవడం, దాన్ని ఎలా తీర్చాలో తెలియకనే ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. మృతుడి తండ్రి రాజిరెడ్డి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. (చదవండి: కరోనా భయంతో బ్యాంక్‌ ఉద్యోగిని ఆత్మహత్య)

మరిన్ని వార్తలు