భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో తట్టుకోలేక...

23 Aug, 2021 08:03 IST|Sakshi

జీడిమెట్ల: కుటుంబ కలహాలతో భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చింతల్‌ చంద్రానగర్‌కు చెందిన ఫార్మా ఉద్యోగి శ్రీకాంత్‌ (35)కు ఆరేళ్ల క్రితం వివాహం కాగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో రెండేళ్లుగా విడి విడిగా ఉంటున్నారు. వీరికి ఉదయ్‌కమల్‌ (5), రుచిత (3) పిల్లలుండగా శ్రీకాంత్‌ తన అక్క రాజేశ్వరి వద్ద వారిని ఉంచాడు.

శ్రీకాంత్‌తో పాటు అక్క కుమారుడు శివచందర్‌ ఉంటున్నాడు. ఈ నెల 21న నైట్‌ డ్యూటీకి వెళ్లిన శ్రీకాంత్‌ ఆదివారం ఉదయం 6 గంటలకు ఇంటికి చేరుకున్నాడు.  ఈ క్రమంలో గణేష్‌నగర్‌లో ఓ హాస్టల్‌లో ఉండే తన సోదరి అనితకు ఫోన్‌ చేసి రాఖీ కట్టడానికి రమ్మని చెప్పాడు. ఆమె ఉదయం 8.30 గంటలకు ఫోన్‌ చేయగా శ్రీకాంత్‌ లిఫ్ట్‌ చేయలేదు. ఇంటికి వచ్చి చూడగా శ్రీకాంత్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. మృతుడి మేనల్లుడు శ్యామ్‌ చందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్య వెళ్లిపోయిందనే మానసిక ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు