ప్రియుడు ఆత్మహత్య.. నువ్వు లేని జీవితం నాకొద్దు

12 Nov, 2021 08:43 IST|Sakshi
శివశంకర్‌(ఫైల్‌)

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బలవన్మరణం 

ప్రేయసి ఆత్మహత్యతో కుంగుబాటు

పీలేరు రూరల్‌ : ‘నువ్వు లేని జీవితం నాకొద్దు’ అని ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక కడప మార్గంలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం.. రొంపిచెర్ల మండలం గానుగచింతకు చెందిన పాలమంద కృష్ణయ్య కుమారుడు పి.శివశంకర్‌ (25) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేసేవాడు. అదే పంచాయతీ లోకవారిపల్లెకు చెందిన అబ్బునాయక్‌ కుమార్తె శిల్ప, శివశంకర్‌ పరస్పరం ప్రేమించుకున్నారు.

పెళ్లి కూడా చేసుకోవాలని భావించినా కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన శిల్ప ఐదునెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అప్పటికే వర్క్‌ ఫ్రం హోంలో ఉన్న శివశంకర్‌ ఈ ఘటనపై తీవ్రంగా కుంగిపోయాడు. దీంతో  తల్లిదండ్రులు అతడిని తిరుపతిలోని తమ కుమార్తె ఇంటికి నెలక్రితం పంపారు. అంతేకాకుండా  శిల్ప జ్ఞాపకాల నుంచి దూరం చేయాలని తలచి వివాహం చేస్తామని చెప్పడంతో తిరస్కరించాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 2న తిరుపతిలోని తన అక్క ఇంటి నుంచి శివశంకర్‌ అదృశ్యమయ్యాడు.

కుటుంబ సభ్యులు ఫోన్‌ చేసినా హలో అని..ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసేవాడు. ఈ పరిణామాల క్రమంలో  పీలేరు–కడప మార్గంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఓ చింత చెట్టుకు ఉరి వేసుకుని ఓ యువకుడు బలవన్మరణం చెంది ఉండటం గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, శిల్పలేని జీవితం తనకు వద్దు.. అని తన వివరాలతో శివశంకర్‌ రాసి ఉన్న లేఖ అతడి జేబులో లభించింది. పీలేరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం నిమిత్తం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు