కోరుకున్న ఉద్యోగం రాలేదు, ఏజెన్సీ మోసం.. రెండు నెలలుగా..

6 Dec, 2021 15:08 IST|Sakshi

సాక్షి,ఇల్లెందు(ఖమ్మం): కొలువు వేటలో విసిగి వేసారిన ఓ యువకుడు తనువు చాలించాడు. కట్టుకున్న భార్యకు, కన్న తల్లిదండ్రులకు పుట్టెడు శోకం మిగిల్చాడు. ఈ విషాదకర సంఘటన ఆదివారం ఇల్లెందు పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ అక్కిరాజు గణేష్‌ పెద్ద కుమారుడు అజయ్‌(30) బీటెక్‌ పూర్తి చేశాడు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో హైదరాబాద్‌కు చెందిన ఓ ఏజెన్సీకి రూ. 3 లక్షలు చెల్లించాడు. కానీ ఓ కంపెనీలో తాత్కాలిక పద్ధతిన ఉద్యోగం కల్పించారు. రెండు నెలల నుంచి ఆ కంపెనీ పైసా వేతనం చెల్లించలేదు.

గడిచిన మే నెలలో అజయ్‌కు వివాహం కూడా జరిగింది. భార్య దుర్గాభవాని ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. నాలుగు రోజుల క్రితమే ఆస్పత్రికి వెళ్లేందుకు పట్టణంలోనే సుభాష్‌నగర్‌లో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. కాగా అజయ్‌ వర్క్‌ ఫ్రం హోమ్‌లో భాగంగా ఇంటి నుంచే వర్క్‌ చేస్తున్నాడు. కోరుకున్న ఉద్యోగం రాకపోవడం, ఏజెన్సీ మోసం చేయడం, రెండు నెలలుగా పనిచేసిన కంపెనీ కూడా వేతనం చెల్లించకపోవడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో తన గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకున్నాడు. ఎంతకు బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు వెళ్లి తలుపులు తెరిచి చూడగా.. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

పుట్టింటి నుంచి వచ్చిన భార్య  విగతజీవిగా మారిన భర్తను చూసి గుండెలవిసేలా రోదించింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మోసం వలే తన కుమారుడు మృతి చెందాడని తండ్రి వాపోయాడు. గోవాలో ఉన్న ఎమ్మెల్యే హరిప్రియ, మార్కెట్‌ చైర్మన్‌ బాణోతు హరిసింగ్‌ నాయక్, జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య ఫోన్‌లో గణేష్‌ను పరామర్శించారు. టీఆర్‌ఎస్‌ నేతలు గుండా శ్రీకాంత్, మహేందర్, పీవీ కృష్ణారావు, హరికృష్ణ, హరినాథ్‌బాబు, సన రాజేష్, రాజు తదితరులు మృతదేహాన్ని సందర్శించి, సంతాపం తెలిపారు.

చదవండి: రెండురోజుల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు.. గుట్టుగా ఒకటి.. దర్జాగా మరొకటి

మరిన్ని వార్తలు