ఇళ్లు కొనుగోలు పేరుతో రూ.8 లక్షలు కాజేసి వ్యక్తి పరార్‌!

7 Jan, 2022 10:06 IST|Sakshi

పాయకాపురం(విజయవాడరూరల్‌): ఇంటి కొనుగోలు పేరుతో డబ్బులు తీసుకొని పరారైన వ్యక్తిపై నున్న పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. శాంతినగర్‌లో నివసించే కసుకుర్తి అనంతలక్ష్మి టైలర్‌గా పనిచేస్తుంది. ఆమె భర్త ఆర్టీసీ డ్రైవర్‌. వీరి ఇంట్లో అద్దెకుండే కుడుముల పాండురంగారావు అనే వ్యక్తి ఇల్లు కొనాలని అనంతక్ష్మి వద్ద రూ.8 లక్షల 60 వేలు తీసుకున్నాడు. డబ్బులు ఇచ్చి నెల రోజులు గడిచినా తిరిగి చెల్లించకపోవడంతో దంపతులు నిలదీశారు. దీంతో ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి పాండురంగారావు పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

ముగ్గురు పేకాటరాయుళ్ల అరెస్టు.... 
నున్న గ్రామం గొల్లవాని కుంట వద్ద పేకాడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. వారి నుంచి రూ.1960 స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. పేకాట, కోడి పందేలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. 

గాయపర్చిన వ్యక్తి పై కేసు.... 
చికెన్‌ పకోడి తింటున్న వ్యక్తి పిలిచిన వెంటనే రాలేదని  కోపం వచ్చిన మరో వ్యక్తి రాయితో గాయపర్చినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. పైపులరోడ్డు సెంటర్లో ఆటోలకు టేప్‌ రికార్డులను బిగించే పనిచేసుకుంటున్న షేక్‌ ఖాదర్‌ 4వ  తేదీన ఓ బండి వద్ద చికెన్‌ పకోడి తింటున్నాడు. మణి అనే వ్యక్తి ఖాదర్‌ను పిలిచి ఏంట్రా పిలిచిన వెంటనే రావేంటని రాయితో తల పై మోదాడు. గాయమైన ఖాదర్‌ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడు మణిపై కేసు నమోదు చేశారు. 

చదవండి: Inspirational Story: 26 ఏళ్ల కొడుకును వీపుపై మోస్తూ ప్రపంచ పర్యటన చేస్తున్న తల్లి!
 

మరిన్ని వార్తలు