ఐదుగురితో కలిసి కారులో ఎక్కించుకొని.. అర్ధరాత్రి దాటాక!

6 Jul, 2021 09:57 IST|Sakshi
జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌ ఎదుట తన గోడును వెళ్లబోసుకుంటున్న బాధితురాలు  

మహిళపై చిత్రహింసలు 

కారులో ఎక్కించుకుని రాత్రంతా చక్కర్లు

చివరకు ప్రధాన రహదారిపై దింపేసి వెళ్లిన ప్రబుద్ధులు

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

సాక్షి, జడ్చర్ల(మహబూబ్‌నగర్‌): పెద్ద దిక్కుగా ఉంటానంటూ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఈ ప్రబుద్ధుడు. ఈ క్రమంలోనే బలవంతంగా కారులో ఎక్కించుకుని మరో నలుగురితో కలిసి ఆమెను రాత్రంతా చిత్రహింసలకు గురిచేసి మొబైల్‌ ఫోన్, పర్సు గుంజుకున్నాడు. తెల్లవారుజామున ప్రధాన రహదారిపై ఆపి బయటకు తోసేసి వెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌లో మ్యారేజ్‌ బ్యూరో నిర్వహిస్తున్న 37ఏళ్ల మహిళతో ఎనిమిది నెలలుగా జడ్చర్లకు చెందిన పెద్ద వెంకటేశ్‌గౌడ్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

తన భార్య ఆరోగ్యంగా లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు కలువలేకపోతున్నానని చెప్పాడు. తాను పెద్ద దిక్కుగా ఉంటానంటూ నమ్మబలికి భార్యతోనూ మాట్లాడించాడు. ఇటీవల మహబూబ్‌నగర్‌కు చెందిన మిత్రుడు వెంకటేశ్‌ తదితరులతోనూ వివాహేతర సంబంధం పెట్టుకోవాలన్నాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఈనెల 2న జడ్చర్లలోని తన ఇంటికి రప్పించాడు. అనంతరం కారులో ఎక్కించుకుని తన బావమరిదితో కలిసి మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. అక్కడి నుంచి క్రిస్టియన్‌పల్లి మీదుగా భూత్పూర్‌కు తీసుకెళ్లారు. అక్కడి దాబాలో ఉన్న పెద్ద వెంకటేశ్‌గౌడ్‌ తమ్ముడు చిన్న వెంకటేశ్‌గౌడ్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కారులోకి  ఎక్కి  ఆమెను చిత్రహింసలకు గురిచేశారు.

అక్కడి నుంచి తిరిగి జడ్చర్ల మీదుగా అర్ధరాత్రి దాటాక రెండు గంటలకు మయూరి నర్సరీ సమీపంలో పర్సు, మొబైల్‌ ఫోన్‌ లాక్కొని దింపేసి వెళ్లిపోయారు. కాలినడకన మహబూబ్‌నగర్‌లోని పాత డీఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ఎవరూ లేకపోవడంతో జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని గేటు వద్ద ఉన్న కానిస్టేబుళ్లకు తన గోడును వెళ్లబోసుకుంది. చివరకు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. మూడు గంటలకు డీఎస్పీ శ్రీధర్‌ వచ్చి బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

ధర్నాకు అనుమతివ్వండి 
నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆమె జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ సిగ్నల్‌గడ్డపై ధర్నా చేసేందుకు అనుమతివ్వాలని కోరగా పోలీసులు నిరాకరించారు. అనంతరం విలేకరుల ఎదుట తన గోడును వెళ్లబోసుకుంది. నిందితులు ధన బలంతో పోలీసులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. తన మొబైల్‌లోని ఫొటోలు, వీడియో, ఆడియో రికార్డులను డిలీట్‌ చేసి పోలీసులకు అప్పగించారన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.  

మరిన్ని వార్తలు