వివాహితతో బలవంతంగా వ్యభిచారం

7 Jun, 2021 10:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పోలీసులను ఆశ్రయించిన మహిళ

డబ్బు కాజేసి మోసం చేసిన ఇద్దరిపై ఫిర్యాదు

కేసు దర్యాప్తు చేస్తున్న నరసరావుపేట పోలీసులు 

నరసరావుపేట టౌన్‌(గుంటూరు జిల్లా): తనతో పాటు తన కుమార్తెను చంపుతామని బెదిరించి తనతో ముంబాయిలో వ్యభిచారం చేయించి ఆ డబ్బు తీసుకొని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన ఓ వివాహిత నరసరావుపేట వన్‌టౌన్‌ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. సీఐ ఎం.ప్రభాకరరావు కథనం మేరకు.  26 ఏళ్ల వివాహిత భర్తతో విడిపోయి పెద్దకుమార్తెతో కలిసి పట్టణంలోని ప్రకాష్‌నగర్‌లో నివాసం ఉంటున్న తల్లి వద్దకు చేరుకుంది. 2017 నుంచి తల్లితోనే నివసిస్తోంది. అప్పటికే ఆమె తల్లి, వినుకొండకు చెందిన దూదేకుల మీరావలితో సహజీవనం చేస్తోంది. తాను చెప్పిన వ్యక్తులతో వ్యభిచారం చేయకపోతే వివాహితను, ఆమె కుమార్తెను చంపుతానని మీరావలి భయపెట్టాడు.

అయితే దీనికి ఆ యువతి ఒప్పుకోలేదు. దీంతో దూదేకుల మీరావలి, తన స్నేహితుడైన చాగల్లు గ్రామానికి చెందిన సైదాతో కలిసి ఆ యువతిని కొట్టి బలవంతంగా ముంబాయి తరలించి తొమ్మిది నెలలపాటు వ్యభిచారం చేయించారు. వచ్చిన డబ్బును యువతి కుమార్తె పేరుపై వేస్తామని నమ్మబలికిన మీరావలి, సైదా తమ అకౌంట్లకు జమ చేసుకున్నారు. తొమ్మిది నెలల అనంతరం నరసరావుపేటకు వచ్చిన ఆమె తన డబ్బు గురించి మీరావలిని ప్రశ్నించగా తనను కొట్టి మళ్లీ బలవంతంగా ఐదు నెలలపాటు వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లి వ్యవభిచారం చేయించారని పేర్కొంది. కొంతకాలంగా మీరావలి చెప్పిన పని చేయకూడదని ఆ వివాహిత నిర్ణయించుకుంది. అయితే మళ్లీ వ్యభిచారం చేయకపోతే చంపుతామని మీరావలి, సైదా బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. తనతో బలవంతంగా వ్యభిచారం చేయించి సుమారు రూ.15 లక్షలు కాజేసిన మీరావలి, సైదాపై చర్యలు తీసుకోవాలని ఆమె చేసిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

చదవండి: విషాదం: క్షణికావేశం..తీసింది ప్రాణం..    
టీడీపీలో కలకలం: కుప్పంలో ‘జూనియర్‌’ జెండా! 

మరిన్ని వార్తలు