ఇన్‌స్టాగ్రామ్‌లో మైనర్‌కు ‘ఐ లవ్‌ యూ’ మెసేజ్‌

29 Apr, 2022 05:16 IST|Sakshi

బిలాయ్‌లో నిందితుడిని అరెస్ట్‌ చేసి 

తీసుకొచ్చిన హైదరాబాద్‌ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌లో పరిచయమైన మైనర్‌కు ‘ఐ లవ్‌ యూ’ అంటూ మెసేజ్‌ పెట్టిన యువకుడు కటకటాల్లోకి చేరాడు. ఛత్తీస్‌గఢ్‌లోని సుపేలా బిలాయ్‌ ప్రాంతానికి చెందిన శివ సెహగల్‌ (21) విద్యార్థి. ఇతడికి కొన్ని రోజుల క్రితం నగరానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైంది. కొన్నాళ్లు చాటింగ్‌ చేసిన శివ ఆ బాలికకు ‘ఐ లవ్‌ యూ’ అంటూ సందేశం పంపాడు.

ఇది బాలిక తల్లిదండ్రుల దృష్టిలో పడింది. దీంతో వారు సిటీ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్‌ అభిలాష్‌ పోక్సో, ఐటీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన శివ సుపేలా బిలాయ్‌లో ఉన్నట్లు గుర్తించిన ప్రత్యేక బృందం అతడిని అరెస్టు చేసి గురువారం సిటీకి తీసుకొచ్చింది. స్థానిక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. కాగా.. సదరు బాలిక శివను ఏం చేయొద్దని, అతడు చాలా మంచివాడని తల్లిదండ్రులతో వాదిస్తుండటం గమనార్హం. 

మరిన్ని వార్తలు