హత్యల కేసులో నిందితుడు.. కువైట్‌ జైలులో ఏపీవాసి అనుమానాస్పద మృతి

17 Mar, 2022 10:26 IST|Sakshi
పిల్లోల్ల వెంకటేష్‌ (ఫైల్‌ ఫొటో)

కువైట్‌లో హత్య కేసులో జైలులో ఉన్న వైఎస్సార్‌జిల్లా వాసి వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం సెంట్రల్‌ జైలు కస్టడీలో ఉ​న్నఅతను బుధవారం సాయంత్రం తన గదిలో రెండు వరసల మంచానికి.. గుడ్డతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ‘అరబ్‌ టైమ్స్‌’ పత్రిక పేర్కొంది. వెంకటేష్‌ అత్మహత్యపై ప్రాసిక్యూషన్, ఫోరెన్సిక్ విభాగానికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 నుంచి 1 గంట ప్రాంతంలో జరిగినట్లు సమాచారం.

కువైట్ లో ఆత్మహత్యకు పాల్పడిన పిల్లోల్ల వెంకటేష్‌ మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి  ఎపీఎన్‌ఆర్‌టీ ద్వారా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. 
(చదవండి: ‘నా భర్తను ఇండియాకు పిలిపించండి.. అన్యాయంగా ఇరికించారు’ )

నా భర్తను అన్యాయంగా ఉరి వేసి చంపారు
వెంకటేష్‌ మరణ వార్త తెలియగానే అతని భార్య స్వాతి, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్తను అన్యాయంగా ఉరి వేసి చంపేశారని, ఇక తన పిల్లలకు దిక్కెవరంటూ మృతుడి భార్య స్వాతి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఆఖరికి తన భర్త చివరి చూపైనా దక్కుతుందా లేదా అని స్వాతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏ తప్పూ చేయని తన భర్తను ప్రభుత్వాలు కాపాడలేకపోయాయని ఆమె తల్లడిల్లుతోంది. వెంకటేష్ మరణవార్తతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అసలు ఏం జరిగిందంటే..
వైఎస్సార్‌ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడు కస్పాకు చెందిన పిలోళ్ల శ్రీరాములు కుమారుడు వెంకటేష్‌ కువైట్‌లో ఓ సేఠ్‌ వద్ద టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్దియా పట్టణంలోని ఒకే కుటుంబానికి చెందిన సేఠ్‌ అహ్మద్‌ (80), అతని భార్య కాల్దా (62) కుమార్తె అసుమ (18)ను దారుణంగా హత్య చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేసి అక్కడి జైల్లో ఉంచారు.

ఆయన భార్య స్వాతి కూడా కువైట్‌లోని ఓ న్యాయవాది ఇంట్లో పనిచేస్తోంది. అయితే న్యాయవాది సహాయంతో ఈ నెల 10న కువైట్‌ నుంచి వైఎస్సార్‌ జిల్లాకు వచ్చిన వెంకటేష్‌ భార్య స్వాతి శుక్రవారం తన పిల్లలు జయవర్ధన్, విష్ణువర్ధన్, అత్తామామలు శ్రీరాములు, రమణమ్మ, కుటుంబసభ్యులతో కలిసి తన భర్త ఏ నేరమూ చేయలేదని, స్వదేశానికి రప్పించేందుకు సాయం చేయాలని కడప కలెక్టర్‌ వి.విజయకుమార్‌ రాజుకు స్వాతి విజ్ఞప్తి చేసింది. కలెక్టర్‌ కూడా సానుకూలంగానే స్పందించారు. కానీ అంతలోనే ఈ దారుణం జరిగిపోయింది.

మరిన్ని వార్తలు