జోగిపేటలో కిడ్నాప్‌ కలకలం..

27 Apr, 2021 11:46 IST|Sakshi

సాక్షి, జోగిపేట(అందోల్‌): జోగిపేట పట్టణంలో ఆదివారం సాయంత్రం కిడ్నాప్‌ కలకలం రేపింది. ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేయగా కుటుంబీకులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టిన గంటకే బాధితుడిని సంగారెడ్డిలో వదిలివేశారు. ఈ ఘటకు సంబంధించి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అందోలు మండలం సంగుపేట గ్రామానికి చెందిన కృష్ణ, అశోక్‌ల మధ్య భూవివాదం ఉండడంతో ఉదయం అశోక్‌ జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై ప్రసాద్‌ వారిరువురిని పిలిపించి అశోక్‌ పేర చేయించాల్సిన భూమిని చేయించాలని కృష్ణకు సూచించారు. అయితే అదే సమయంలో రెండు వర్గాలకు చెందిన వారికి వాగ్వాదం జరిగింది.

ఎస్సై ఇద్దరికి నచ్చజెప్పిన అనంతరం అశోక్‌కు చెందిన వారు బయటకు వెళ్లిపోయారు. అశోక్‌ గ్రామస్తుడు ఏసయ్యతో కలిసి పబ్బతి హనుమాన్‌ మందిరం వద్ద నుంచి వెళ్తుండగా  పోచమ్మ దేవాలయం సమీపంలో ఫుట్‌వేర్‌ ముందు తెల్లటి బొలెరా వాహనంలో కొందరు వచ్చి అశోక్‌ను కిడ్నాప్‌ చేశారు. ఈ విషయం అశోక్‌ పక్కనే ఉన్న ఏసయ్య గ్రామస్తులకు, కుటుంబీకులకు ఫోన్‌లో చెప్పాడు. వెంటనే అశోక్‌ సోదరుడు కృష్ణ, గ్రామస్తులు వచ్చి పోలీసులకు కిడ్నాప్‌ విషయాన్ని తెలియజేశారు. విషయం తెలసుకున్న ఎస్సై ఆ ప్రాంతంలో ఉండే సీసీ కెమెరాలను పరిశీలించారు. ముగ్గురు వ్యక్తులు వాహనం నుంచి దిగి అశోక్‌ను ఎక్కించుకున్న దృశ్యాలను గమనించారు. ఈ విషయాన్ని చుట్టూ ఉన్న పోలీసులకు తెలియజేశారు. అయితే గంట తర్వాత అశోక్‌ను సంగారెడ్డి శివారులో వదిలివెళ్లినట్లుగా కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కిడ్నాప్‌కు గురైన అశోక్‌ బస్‌లో జోగిపేట పోలీస్‌స్టేషన్‌ వచ్చి తాను కిడ్నాప్‌కు గురైన వివరాలు తెలుపుతూ ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు