చిన్నారులే అతడి టార్గెట్‌.. కిడ్నాప్‌ చేసి ఆపై..

11 Jul, 2021 07:44 IST|Sakshi

లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్‌ 

సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తింపు

జవహర్‌నగర్‌: అభం శుభం తెలియని చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడుతున్న ఓ నరరూప రాక్షసుడిని రాచకొండ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 4వ తేదీన నాలుగేళ్ల చిన్నారిని అపహరించి అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా 9న సైతం మరో చిన్నారిని కిడ్నాప్‌ చేయబోయి..వీలుకాక తప్పించుకుపోయాడు. దీంతో రాచకొండ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు శనివారం రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెల్పిన మేరకు...నిందితుడ్ని ఒడిశా రాష్ట్రం బద్రాక్‌జిల్లా కంపాడ గ్రామానికి చెందిన అభిరామ్‌ దాస్‌(40) అలియాస్‌ మహేందర్‌దాస్‌గా గుర్తించారు. బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చి ప్రస్తుతం కీసరమండలలోని బండ్లగూడలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు.

దమ్మాయిగూడ వెంకటేశ్వరకాలనీలో ఓ కిరాణా దుకాణం నిర్వాహకుడికి నాలుగేళ్ల పాప ఉంది. ఈ చిన్నారి ఆదివారం సాయంత్రం తమ ఇంటి నుంచి సమీపంలోని కిరాణ దుకాణానికి వెళ్తున్న క్రమంలో దుండగుడు అపహరించుకుపోయాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు గాలిస్తున్న క్రమంలో సోమవారం ఉదయం బాలిక  దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతినగర్‌ వాటర్‌ట్యాంక్‌ వద్ద కనిపించడంతో పోలీసులకు స్ధానికులు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకునే సమయానికి చిన్నారి చెట్ల పొదల మద్య అపస్మారక స్థితిలో పడిఉంది. వెంటనే మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చిన్నారిపై లైంగికదాడికి జరిగినట్లు గుర్తించారు.

ఇదే వ్యక్తి ఈ నెల 9న ప్రగతినగర్‌లో ఓ బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించగా స్థానికులు అడ్డుకుని నిలదీయడంతో పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు స్ధానికులను విచారించగా ఎరుపు రంగు టీషర్టు.. నల్ల మాస్క్‌ ధరించి ఉన్నాడని వివరాలు తెలిపారు. దీంతో సీసీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు నాగారం రిజర్వు  ఫారెస్ట్‌లోని కట్టమైసమ్మ ఆలయం వద్ద అనుమానంగా తిరుగుతున్న వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్నారు. విచారించగా చిన్నారి పై లైంగికదాడికి పాల్పడినట్లు అంగీకరించాడు. ఈమేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు