అప్పు తీర్చడం లేదని ముగ్గురు కలిసి కిడ్నాప్‌ 

9 Nov, 2021 06:41 IST|Sakshi

గదిలో నిర్బంధం చిరు వ్యాపారిని 

విడిపించిన పోలీసులు.. కేసు నమోదు 

రాజేంద్రనగర్‌: అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించకపోవడంతో ఓ వ్యక్తిని నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు మెరుపు దాడి చేసి బందీ అయిన వ్యక్తిని విడిపించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం..సులేమాన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన తన్వీర్‌ హుస్సేన్‌(45) స్థానికంగా చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహిస్తుంటాడు.

సంవత్సరం క్రితం ఇదే ప్రాంతానికి చెందిన ఖుద్బుద్దీన్‌ వద్ద అప్పుగా రూ.8.50 లక్షలు తీసుకున్నాడు. డబ్బు కోసం తన్వీర్‌ హుస్సేన్‌ను తిరిగి ఇవ్వాలని ఖుద్బుద్దీన్‌ ఎన్నిసార్లు అడిగినా రేపు, మాపు అంటూ దాట వేస్తున్నాడు. దీంతో ఖుద్బుద్దీన్‌ తన స్నేహితులు మహమూద్, ఇబ్రహీంతో కలిసి ఈ నెల 6వ తేదీన తన్వీర్‌ హుస్సేన్‌కు ఫోన్‌ చేసి ఇంటి వద్దకు రావాలని తెలిపారు. తన్వీర్‌ హుస్సేన్‌ రాగానే డబ్బు విషయం అడిగారు.

తన వద్ద లేవని.. రాగానే ఇస్తానంటూ తెలిపాడు. దీంతో ముగ్గురు కలిసి తన్వీర్‌ హుస్సేన్‌ను ఇంట్లోని ఓ గదిలో నిర్బంధించి చితకబాదారు. తన్వీర్‌ హుస్సేన్‌ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా గాలించి.. జాడ తెలియకపోవడంతో రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఖుద్బుద్దీన్‌కు డబ్బులు ఇచ్చే విషయమై తెలపడంతో అతడిపై నిఘా పెట్టారు. సోమవారం ఉదయం ఇంటిపై దాడి చేసి ఓ గదిలో బందీగా ఉన్న తన్వీర్‌ హుస్సేన్‌ను విడిపించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఖుద్బుద్దీన్‌తో పాటు సహకరించిన ఇబ్రహీం, మహమూద్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
 

మరిన్ని వార్తలు