Hyderabad: అమ్ముతావా.. చస్తావా!

19 Oct, 2021 06:26 IST|Sakshi
బాధితుడు కొత్త హరీష్‌ కుమార్‌... 

యూసుఫ్‌గూడలో వ్యక్తి కిడ్నాప్‌   

భూమి చౌకగా ఇవ్వాలని బలవంతం 

దారికి రాకపోవడంతో అపహరణ  

మెదక్‌ జిల్లా కౌడిపల్లి పరిధిలో వదిలివేత  

పోలీసులను ఆశ్రయించిన బాధితుడు 

సాక్షి, బంజారాహిల్స్‌: తక్కువ ధరకే ఖరీదైన భూమిని విక్రయించాలని కొంత కాలంగా బెదిరించినా తమ మాట వినలేదనే కోపంతో నగరంలోని బంజారాహిల్స్‌ పరిధిలో దుండగులు ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేశారు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నియోజక వర్గం కౌడిపల్లికి చెందిన కొత్త హరీష్‌కుమార్‌ (36)కు తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొంత కాలంగా ఈ భూమిపై కన్నేసిన కౌడిపల్లి టీఆర్‌ఎస్‌ మండల యూత్‌ ప్రెసిడెంట్‌ కృష్ణగౌడ్, కౌడిపల్లి సర్పంచ్‌ ఎ.సుధీర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, బుర్దరం పేట సర్పంచ్‌ శ్రీనివాస్‌గౌడ్, నాయికోటి రాజు, టి.సంతోష్‌రావు, ఎస్‌కే ఆసిఫ్, లింగం తదితరులతో పాటు మొత్తం 18 మంది మూడు కార్లలో ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు వచ్చారు.  

యూసుఫ్‌గూడ సమీపంలోని శ్రీకృష్ణదేవరాయ నగర్‌ భవానీ అపార్ట్‌మెంట్స్‌లో అద్దెకుంటున్న హరీష్‌ కుమార్‌ ఇంట్లోకి చొరబడ్డారు. ఆయన కాలర్‌ పట్టుకొని కారులోకి ఈడ్చుకొచ్చారు. అడ్డుగా వచ్చిన హరీష్‌ తమ్ముడు మహేష్‌ను కొట్టుకుంటూ కారులోకి ఎక్కిస్తుండగా ఆయన తప్పించుకొని సమీపంలో దాక్కున్నాడు. హరీష్‌ను కిడ్నాప్‌ చేసి మూడు కార్లలో నర్సాపూర్‌ అడవుల వైపు వెళ్లారు.
 
తప్పించుకున్న మహేష్‌ డయల్‌ 100కు ఫోన్‌ చేసి తన సోదరుడు హరీష్‌ కిడ్నాప్‌ అయిన విషయాన్ని చెప్పాడు. హుటాహుటిన బంజారాహిల్స్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కిడ్నాప్‌ చేసిన కృష్ణగౌడ్‌ నంబర్‌ తీసుకొని వెంటనే హరీష్‌ను తీసుకొని రావాల్సిందిగా పోలీసులు హెచ్చరించారు. దీంతో భయపడ్డ కృష్ణగౌడ్, సుధీర్‌రెడ్డి తదితరులు బాధిత హరీష్‌ను కౌడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో వదిలి అక్కడి నుంచి పరారయ్యారు.  

తన దుస్తులు విప్పేసి దారి పొడవునా తీవ్రంగా కొట్టారని, తొమ్మిది ఎకరాల స్థలాన్ని తమ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ హెచ్చరించారని, లేకపోతే నర్సాపూర్‌ అడవుల్లో పెట్రోల్‌ పోసి చంపేస్తామంటూ బెదిరించినట్లు బాధితుడు తెలిపారు. సోమవారం సాయంత్రం బాధితుడు నగర పోలీస్‌ కమిషనర్‌ను కలిశారు. తనను కిడ్నాప్‌ చేశారంటూ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు.  

తనకు ప్రాణహాని ఉందంటూ సెప్టెంబర్‌ 17న కౌడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశానని బాధితుడు ఆరోపించారు. ఆ రోజు తన ఫిర్యాదుపై పోలీసులు స్పందించి ఉంటే తనను కిడ్నాప్‌ చేసి ఉండేవారు కాదని ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడి పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని ఆరోపించారు. కాగా.. కిడ్నాపర్లు విదేశాలకు వెళ్తున్న ఓ ఎమ్మెల్యేకు వీడ్కోలు పలికేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చి తిరిగి వెళ్తూ ఈ పని చేశారని సమాచారం.  

మరిన్ని వార్తలు