పండు అడిగిందని చిన్నారిని కడతేర్చిన కిరాతకుడు.. తలపై రాడ్డుతో కొట్టి.. ఆపై

23 Jul, 2022 17:07 IST|Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ శామ్లీలోని ఖేడా కుర్‌తార్‌ గ్రామంలో అత్యంత దారుణ ఘటన జరిగింది. అన్నం తినే సమయంలో మామిడిపండు అడిగిందనే కారణంతో ఐదేళ్ల మేనకోడల్ని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. ఆమె పదే పదే మామిడిపండు కావాలని అడుగుతుందని చిరాకుపడి ఈ కిరాతక చర్యకు పాల్పడ్డాడు.

మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో నిందితుడు మొదట చిన్నారి తలపై రాడ్డుతో కొట్టాడు. ఆ తర్వాత కత్తితో ఆమె గొంతు కోశాడు. శవాన్ని సంచిలో చుట్టి ఇంట్లోనే దాచాడు. పాప కన్పించకపోయేసరికి గ్రామస్థులంతా ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. నిందితుడు కూడా ఏమీ తెలియన్నట్లు వారితో కలిసి పాపను వెతుకుతున్నట్లు నటించాడు.

అయితే చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారికి నిందితుడిపై  అనుమానం వచ్చింది. దీంతో అతడు గ్రామం వదిలి పారిపోయాడు. అతని ఇల్లు వెతికిన పోలీసులకు సంచిలో బాలిక మృతదేహం లభించింది. పోలీసులు నిందితుడి కోసం ముమ్మర గాలింపు చేపట్టి గురువారం రాత్రి ఓ అడవి సమీపంలో అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటనలో హత్యకు గురైన చిన్నారి పేరు ఖైరు నిషా.. కాగా నిందితుడి పేరు ఉమర్‌దీన్‌ అని పోలీసులు తెలిపారు.
చదవండి: ఎన్నో కలలు..మరెన్నో ఆశలు.. పెళ్లై ఏడు నెలలు తిరగక ముందే..

మరిన్ని వార్తలు